ఒకపుడు ఉరుములా ఉరిమిన ప్రజాగాయకుడు గద్దర్ ఇపుడెవరికీ అవసరం లేదు. గద్దర్ పాట పలచబడింది. గద్దర్ ఇమెజ్ మసక బారింది. మావోయిస్టు ఉద్యమం విస్తృతంగా ఉన్న రోజుల్లో, రాడికల్స్ వూరూరుని ఉత్తేజ పరుస్తున్న సమయంలో పట్టణాల చౌరాస్తాలలో, పల్లెటూర్ల రచ్చ బండల దగ్గిర, యూనివర్శిటీలలో గద్దర్ పాట,మాట ప్రతిధ్వనించేవి. మావోయిస్టు ఉద్యమం క్రమేణా బలహీన పడింది. మిలీనియల్ కుర్రవాళ్లు వుసుళ్లలా పుట్టుకొచ్చారు. వాళ్లకెవరికి నక్సల్బరీ ఎక్కడుందో, చారుమజుందార్ ఎవరో, ఎర్రజండా ఎమిటో మావో ఆలోచనవిధానం ఎందుకో తెలియదు. వాళ్ల చూపు అమెరికా మీద, వాళ్ల మనసు డాలర్ మీద… ఈ లోపు గద్దర్ కూడా తుపాకి గొట్టం పడేసి చాలా దూరం వచ్చారు. అయితే, పాత ఎర్ర రంగ, పాటల వాసన అయనను చాలా దూరం మోసుకొచ్చింది. ఇక ఆచాప్టర్ అయిపోయినట్లే. గద్దర్ లాగే గద్దర్ పాటకూడా ఎవరకీ అసవరం లేదు. పైసలిస్తే ‘గద్దర్ పాట’ని ఎవరిమీద నయినా రాసేకవులొచ్చారు. అందుకే గద్దర్ ఎవరికీ అవసరంలేదు. ఎపుడయితే గద్దర్ ఎన్నికల బాట పట్టారో ఆరోజే గద్దర్ మ్యాజిక్ మాయమయింది. చివరకు ఏమయింది?
బహుజన మేధావి కంచఐలయ్య వూరూర తిరిగి, గద్దర్ ను గజ్వేల్ నుంచి నిలబెడతామన్నారు. కెసియార్ ని వోడిస్తామన్నారు. అన్ని పార్టీల మద్దతు కూడగడతామన్నారు. అదేమీ జరగలేదు. జరిగితే మంచిదే అనుకున్నట్లుంది, ప్రొఫెసర్ ఐలయ్య ప్రకటనని ప్రజాగాయకుడెపుడూ ఎపుడూ ఖండించలేదు.
తర్వాత గద్దర్ కాంగ్రస్ లో కి వస్తారని, రాహుల్ గాంధీ సలహాదారు కె. రాజు (మాజీ ఐఎఎస్ అధికారి) సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలొచ్చాయి. అదేమయిందో తెలియదు. గద్దరన్న రాహుల్ గాంధీని కలిశారు. ఎందుకు కలిశారో తెలియదు. కొందరు మీడియా వాళ్లేమో ఆయన కాంగ్రెస్ చేరతారని రాశారు, ఇంకొందరేమో ఆయన కొడుకు సూర్యం కు బెల్లంపల్లి టికెట్ ఇప్పించుకునేందుకు పైరవీకోసం వెళ్లారని రాశారు.అదీ లేదు, ఇదీ లేదు. ఈ ఎన్నికల్లో గద్దర్ పాట పేలుతుందని అనుకున్నారు. ఇది కూడా లేదు. కాంగ్రెస్ కు కూడా గద్దర్ క్యాంపెయిన్ మీద పెద్దగా గురి లేదు. ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఆయన్ని పిలిచే అవకాశం లేదు.
ఒక నాడు పాటలతో వేలాది మంది విద్యార్థులను అడవుల బాటపట్టించిన గద్దర్ ఇపుడు ఎవరికీ అవసరం లేదు. మార్క్సిజం చదివి రాడికల్స్ అయిన వాళ్లకంటే, గద్దర్ పాట విని మావోయిస్టు పార్టీ నాటి రూపం పీపుల్స్ వార్ వెంబడి నడిచిన వాళ్లెక్కువ. ఆయన పాట యువతను ఉర్రూత లూగించింది. ప్రతిదానికి ఎక్స్ పయిరీ డేట్ ఉంటుంది. అంతే, గద్దర్ కి గద్దర్ పాటకి కూడా అంతే… గద్దర్ అంటే ఇపుడు గతం. ఎన్నికలబాట పట్టాలనుకున్నపుడే గద్దర్ పొలిటిషన్ అయిపోయాడు. ఎన్నికల నేత కాలేకపోతున్నారు. పాత అధ్యాయం ముగిసింది. అయితే, సీటు రాక, పోటీ చేసే అవకాశం లేక, ఎన్నికల పార్టీలకు అవసరం లేక, తాను సొంతంగా నిలబడలేక… అది ఇలా ముగుస్తుందనుకోలేదు. ఇక ఆయన జ్ఞాపకాలు చెప్పుకుంటూ కాలం వెల్లదీయాల్సిందేనా…