హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడె కౌశిక్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ని ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఈ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో హుజూరాబాద్ కూడా ఒకటి.
ఈటెల రాజేందర్, గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌కి అత్యంత నమ్మకస్తుడైన నాయకుడు. కేసీయార్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారాయన. తెలంగాణ ఉద్యమంలో ఈటెల రాజేందర్‌ని కేసీయార్ ఎలా వాడుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అనూహ్యంగా ఈటెల రాజేందర్ మీద భూ కబ్జా ఆరోపణలు చేస్తూ, మంత్రి పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి కూడా గెంటేశారు కేసీయార్. ఈ క్రమంలో ఈటెల రాజేందర్, ‘కేసీయార్ పతనమే నా జీవిత లక్ష్యం’ అంటూ ప్రకటించేసుకున్నారు. గులాబీ పార్టీకి హుజూరాబాద్‌లో కోలుకోలేని దెబ్బ కొట్టారు కూడా.!
అంతేనా, తాజా ఎన్నికల్లో కేసీయార్ మీద గజ్వేల్‌లో పోటీకి దిగారు ఈటెల రాజేందర్. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ గెలుపుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్. అయితే, హుజూరాబాద్‌లో ఇంకోసారి ఈటెల రాజేందర్ గెలిచే అవకాశాలున్నాయంటూ సర్వేలు చెబుతున్నాయి.
దాంతో, బీఆర్ఎస్ అభ్యర్థి పాడె కౌశిక్ రెడ్డి, తాను గెలిస్తే విజయ యాత్ర అనీ.. ఓడితే శవయాత్ర అనీ.. కన్నీరుమున్నీరవుతూ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని వేడుకున్నారు. ఇంకేముంది, హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్లు, పాడె కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో భావోద్వేగానికి గురవుతారని గులాబీ పార్టీ భావించి వుండొచ్చు.
కానీ, అక్కడ సీన్ వేరేలా వుంది.! ‘ఛత్.. ఇదేం రాజకీయం.?’ అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. చివరాఖరి పంచ్.. అట్టర్ ఫ్లాప్ అయ్యింది. గజ్వేలు సంగతెలా వున్నా, హుజూరాబాద్‌లో ఈటెల గెలుపు ఖాయమైంది. బంపర్ మెజార్టీ కూడా దక్కేలా వుంది.!