2019లో కాంగ్రెస్ ను ఓడించడం మోదీ కంటే కెసియార్ కే ముఖ్యం

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 23 నుంచి రాజకీయ జైత్ర యాత్రకు బయలు దేరుతున్నారు. ఆయన కుటుంబ సమేతంగా వెళ్తున్నప్పటికి అది విహారాయాత్ర కాదు, అలాగే తీర్థయాత్రాదు.ఈ రెండు ఒక మోతాదులో కలసిన రాజకీయ యాత్ర. స్వామీజీల, దేవతల ఆశీస్సులు తీసుకుని ఆయన తన పెండింగ్ ప్రాజెక్టు ‘ఫెడరల్ ఫ్రంట్ ’ ఏర్పాటు పని మీద రాజకీయ యాత్రకు బయలు దేరుతున్నారు.

 

2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ రాకుండా చూడాల్సిన బరువు బాధ్యతలు ఇపుడు ప్రధాని మోదీ కంటే ముఖ్యమంత్రి కెసియార్ మీదే ఎక్కువ పడ్డాయి. తెలంగాణలో కెసియార్ గెలుపొందడం, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రజాకూటమి వోడిపోవడం బిజెపికి లోలోన సంతోషించడం కలిగించి వుండవచ్చు, అయితే, మూడు ముఖ్యమయిన రాష్ట్రాలలో బిజెపి వోడిపోవడం కెసియార్ కు బాధ కల్గించి వుండవచ్చు. ఎందుకంటే, మోదీ మళ్లీ రావాలని, కాంగ్రెస్ కు నూకలు చెల్లాలన్నదే కెసియార్ కోరిక. ఆకోరిక ప్రకారం తెలంగాణలో ఆయన కాంగ్రెస్ ను సులభంగా మట్టి కరిపించారు.

 

అయితే రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీష్ గడ్ లలో మోదీ ఆ పనిచేయలేక చతికిల పడ్డటం కెసియార్ కు ఇబ్బందికలిగించే విషయం. ఆయనను బాగా నిరాశ పర్చి ఉండవచ్చు. ఈ మూడు రాష్ట్రాలలో మోదీ ఓటమితో మోదీ నాయకత్వ సామర్థ్యం మీద అనుమానాలు కూడా మొదలయ్యాయి. మహారాష్ట్రలో ఒక ప్రముఖ బిజెపి నేత అశోక్ తివారి మోదీని మార్చి నితిన్ గడ్కరికి 2019 ఎన్నికల బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా పని ఫసక్ అని ఇంగ్లీష్ సోషల్ మీడియా లో పుంఖాను పుంఖాలుగా రాస్తున్నది. ఈ నేపథ్యంలో కెసియార్ బరువు బాధ్యతలు పెరిగాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టాల్సిన బాధ్యత కెసియార్ దే. దానికి తోడు కాంగ్రెస్ కూటమిని ఓడించే రహస్య తన దగ్గిర ఉందని కూడా కెసియార్ చెప్పవచ్చు. ఇది కెసియార్ ముందున్న తక్షణ కర్తవ్యం.

 

అందుకే ఆయన క్యాబినెట్ కూర్పు కంటే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు. క్యాబినెట్ ఎపుడు ఏర్పాటవుతుందో తెలియదు. అయితే, ఆయన ఫెడరల్ ఏర్పాటు కోసం ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులను కలుసుకుంటున్నారు. గతంలో ఆయన ఇదే పనిమీద రాష్ట్రాలు తిరిగినపుడు ఆయన రాజకీయ భవితవ్యం గురించి అనుమానాలుండేవి. ఇపుడాయన విజేత. ఆయన మాటకు ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు విలువ ఇచ్చే అవకాశం ఉంది.

 

తెలంగాణలో ఏవిధంగా చంద్రబాబును అపకీర్తి పాలు చేసి తెలంగాణ ఓటర్లను ఐక్యం చేశారో, అదే విధంగా ఆయన ఇపుడు జాతీయ స్థాయలో చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే, కాంగ్రెస్ నాయకత్వంలో కూటమిని ఏర్పాటు చేసేందుకు,రాహుల్ ను ప్రధానిని చేసేందుకు చంద్ర బాబు కంకణంకట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆయన బాహాటంగా నే ప్రకటించారు. కాంగ్రెస్ కూడా చంద్రబాబుకు చాలా పలుకుబడి ఉందని, అది తనకు ఫ్రంటు కూర్పులో పనికొస్తుందని నమ్ముతూ ఉంది. దీనిని దెబ్బతీసి చంద్రబాబు కాంగ్రెస్ ల మధ్య కుదిరిన ఒప్పందం బయటపెట్టడమే కెసియార్ యాత్ర ఉద్దేశమయి ఉంటుంది.

 

చంద్రబాబు కాంగ్రెస్ ఫ్రంటు ప్రయత్నాలు సాగకుండా చేయడమే కెసియార్ యాత్ర ఉద్దేశం లాగా ఉంది. అందుకే ఆయన యాత్రవిశాఖలో శారదా పీఠాన్ని సందర్శించడంతో మొదలువుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించిన కార్యక్రమం ప్రకారం ఆయన స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకుంటారు. ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. స్వామి సర్వూపానంద సాదాసీదా ఆద్యాత్మిక గురువు కాదు. ఆయనకు రాజకీయాలుకూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చంద్రబాబుకు బాగా వ్యతిరేకి. చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోవాలని కోరుకుంటున్నస్వామీజి. ఆయన ఆశీస్సులతో కెసియార్ రాజకీయ యాత్ర మొదలవుతున్నదంటే కెసియార్ రాజకీయ ఉద్దేశమేమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

 

ఇంతవరకు ఫ్రంటు రాజకీయాల గురించి అంతగా పబ్లిక్ లో మాట్లాడని ముఖ్యమంత్రుల నవీన్ పట్నాయక్ ఒకరు. ఇపుడు కాంగ్రెస్ వ్యతిరేక (బిజెపి వ్యతిరేక కూడా ) ఫ్రంటులో కలసి రావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఒప్పించాలి. ఎన్డీయే నుంచి బయటకొచ్చాక, ఆయన ఏ ప్రంటులో లేరు. ఆయనకు ఆ అవసరం కూడా పడలేదు. ఆయన రాష్ట్రంలో బిజెపిగాని, కాంగ్రెస్ గాని పెద్ద శత్రులు కాదు. కేంద్రంలో ఎవరొచ్చినా ఆయన తన పని తాను చేసుకు పోగలరు. ఆయన సీటు చాలా పదిలం. కెసియార్ లాగా కాంగ్రెస్ ను ఓడించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఎన్నికలపుడు పోరాడతాడు, గెలుస్తాడు. అంతేకాని, దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్న అభిలాషను ఆయన ఎపుడూ వ్యక్తం చేసినట్లులేరు.

 

ఇక మమతా బెనర్జీ బిజెపి వ్యతిరేకి, కాంగ్రెస్ కు అంత వ్యతిరేకి కాదు. కెసియార్ ఫ్రంటు స్వభావం బేరీజు వేయలేనంత అమాయకు రాలు కాదు. ఆమెను కూడా ఆయన ఒప్పించాలి. ఇదే సమస్య అఖిలేష్ యాదవ్, మాయావతి తో ఉంది. వాళ్లిద్దరు బిజెపి వ్యతిరేకులేగాని కాంగ్రెస్ తో వారికి ఉన్న సమస్యలు అంత సీరియస్ వి కాదు. కెసియార్ కు కాంగ్రెస్ ప్రధాన శత్రువు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ కూటమి వస్తే కెసియార్ కు రెండు సమస్యలున్నాయి. ఒకటి, ఆయన రాహుల్ తో కరచాలనం చేయాలి. సోనియాను కలుసుకుంటూ ఉండాలి. రెండు, రాష్ట్రంలో అది కాంగ్రెస్ కు ఉతమిస్తుంది. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి కాంగ్రెస్ తో ఈ సమస్య లేదు. అందువల్ల తెలంగాణ స్థానిక రాజకీయాలు కెసియార్ ను నడిపిస్తున్నాయని వేరే చెప్పనవసరం లేదు. అలాంటపుడుచిన్న పార్టీ స్థాయికి పడిపోయిన కాంగ్రెస్కు వ్యతిరేకంగా (బిజెపికి వ్యతిరేకమని కూడా కెసియార్ చెబుతారు. దాన్నెవరూ నమ్మరు.) ఫ్రంటు కట్టడం చాలా కష్టంతో కూడా కున్న పని. స్వామీజీల అశీస్సులు, పూజా ఫలాలు ఎంతవరకు పని చేస్తాయో చూడాలి.  2019 లో కాంగ్రెస్ ను తరిమికొట్టాలికాబట్టే ఆయన క్యాబినెట్ కూర్పు కంటే ఫెడరల్ ఫ్రంటు ఏర్పాటుకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి రేపు రాజకీయ యాత్రకు బయలుదేరుతున్నారు.