టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైన కాంగ్రెస్ మాజీ ఎంపీ

తెలంగాణ కాంగ్రెస్ కు మరో కోలుకోలేని ఎదురు దెబ్బ తగలబోతున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ పార్టీకి రాజీనామాచేసి కారెక్కెందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరు ఆయన అంటే…

భారత క్రికెట్ టిం మాజీ కెప్టెన్, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్. అజారుద్దీన్ ను తెలంగాణ అసెంబ్లీ సందర్బంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి కీలక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఆయన టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

అజారుద్దీన్ ఇటీవల జరిగిన ఓ ఎంపీ కూతురు వివాహానికి హాజరయ్యారు. ఆ వివాహంలో టిఆర్ఎస్ కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగానే ఉన్నారని సమాచారం. ఎంపీ టికెట్ హామీ కన్ఫమ్ అయినట్టు చర్చ జరుగుతోంది. సంక్రాంతి తర్వాత అజారుద్దీన్ ఏ క్షణంలోనైనా టిఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తోంది.      

అజారుద్దీన్

అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటి చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన పోటి చేయలేదు. పూర్తిగా తెలంగాణ కే పరిమితమైన అజారుద్దీన్ పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించలేదు.

2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపును అజార్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార సమయంలోనే అజారుద్దీన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవినిచ్చారు.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం టిఆర్ ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోలేదు. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. పలు జిల్లాల్లో క్యాడర్ కు దగ్గరగా ఉన్న నేతలు పార్టీలో వచ్చిన అసంతృప్తులతో రాజీనామాలు చేశారు. పలు జిల్లాల్లో జడ్పీ ఫ్లోర్ లీడర్లు రాజీనామా చేశారు. పలువురు కీలక నేతలు రాజీనామా చేయడంతో పార్టీలో కలవరం మొదలైంది. కీలక నేతగా పేరున్న అజారుద్దీన్ కారు ఎక్కబోతున్నారన్న సమాచారంతో నేతలు ఆయనతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరీ అజారుద్దీన్ పార్టీలో కొనసాగుతారా లేక టిఆర్ఎస్ లో చేరుతారా అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. అజారుద్దీన్ టిఆర్ఎస్ చేరడం ఖాయమేనని ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది.