సీబీఐ అంటే భయమా.? వెటకారమా.? నిర్లక్ష్యమా.?

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిందట. ఆమె విచారణకు హాజరు కానున్నారట. హాజరై తీరాలి మరి.! ప్రజా ప్రతినిథి కదా, వ్యవస్థల్ని గౌరవించకపోతే ఎలా.? సీబీఐ కావొచ్చు, ఈడీ కావొచ్చు.. ఏ దర్యాప్తు సంస్థ అయినా.. విచారణకు పిలిస్తే, రాజకీయ నాయకులు అస్సలేమాత్రం కంగారుపడకూడదు. బాధ్యతగా వ్యవహరించాలి.

కానీ, జరుగుతున్న కథ వేరు. సీబీఐని ‘పంజరంలో చిలక’గా మార్చేసిన రాజకీయం చూశాం. ఎవరు కేంద్రంలో అధికారంలో వున్నా, వారి చేతుల్లోనే సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలుంటున్నాయి. ఆదాయపు పన్ను శాఖ ఇందుకు మినహాయింపేమీ కాదు. అక్కడే అసలు సమస్య వస్తోంది. తమ మాట వింటే, ఆయా వ్యక్తులు లేదా పార్టీల చుట్టూ సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు వెళ్ళకుండా కేంద్రంలో అధికారంలో వున్నవారు వ్యవహరిస్తున్నారు. ఎవరు అధికారంలో వున్నా ఇదే తంతు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలంటే అంత చులకన. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలైనా అంతే.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఇంకో రాష్ట్రం.. ఇంకో రాష్ట్రం ఎక్కడైనా అదే వ్యవహారం. ఎప్పుడూ అధికారంలో వున్నవారి మీద పెద్దగా కేసులుండవు.. ఆయా రాష్ట్రాల్లో. తమతో స్నేహంగా వుండేవారి మీద సోదాలు జరగకుండా కేంద్రంలో అధికారంలో వున్నోళ్ళు జాగ్రత్త పడుతుంటారు. అందుకే, తీవ్రమైన కేసుల్లో కూడా రాజకీయ నాయకులు న్యాయస్థానాల్ని ఆశ్రయించి, ఆయా దర్యాప్తులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆయా కేసుల్లో డొల్లతనం దృష్ట్యా, న్యాయస్థానాలూ ఆయా దర్యాప్తులపై స్టే విధించడమో.. ఇంకోటో చేస్తుంటాయ్. వ్యవస్థల్ని వెటకారం చేసిన రాజకీయం.. ఆ రాజకీయం మళ్ళీ చిత్తశుద్ధి లాంటి గొప్ప మాటలు మాట్లాడుతుంటుంది.