వైసీపీలో వర్గ విబేధాలు ఏదో కొద్దిస్థాయిలోనే ఉన్నాయని ఇన్నాళ్లు అనుకుంటుండగా లేదు తారాస్థాయికి చేరుకున్నాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు నడుమ సైలెంట్ వార్ నడుస్తోంది. మంత్రులేమో ఎమ్మెల్యేల మీద ఆధిపత్యం చేయాలి చూస్తున్నారు. ఏకంగా జిల్లాలనే గుప్పిట పట్టాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు ఎంపీలు తమ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీల్లో తాము చెప్పిందే జరగాలని పట్టుబడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారు. పలుకుబడి ఉన్నవారు ఈ గ్రూప్ రాజకీయాలను ధీటుగా ఎదుర్కొంటుంటే మొదటిసారి ఎమ్మెల్యే అయినవాళ్లు మాత్రం విలవిల్లాడిపోతున్నారు. అందుకు ఉదాహరణే ఉండవల్లి శ్రీదేవి వివాదాలు. ఆమెను ఎంతమంది టార్గెట్ చేశారో అందరికీ తెలుస్తూనే ఉంది.
అలాంటి ఎమ్మెల్యేనే ఇంకొకరు ఉన్నారు. ఆయనే తూర్పు గోదావరి జిల్లా టి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఈయన గత ఎన్నికల్లో మాత్రం గెలుపొందారు. మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలో ఏవేవో చేయాలని అనుకున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలని తహతహలాడారు. కానీ వాస్తవంలో సీన్ అలా లేదు. ఎమ్మెల్యే అయినా ఆయన్ను పట్టించుకునేవారే లేరు పార్టీలో. పట్టించుకోకపోగా పైనపడి తొక్కేస్తున్నారట. దీంతో ఎమ్మెల్యేకు ఏం చేయాలో పాలుపోక హైకమాండ్ ను అప్రోచ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రధానంగా ఇద్దరు మంత్రులు ఆయన్ను ముందుకు వెళ్లకుండా ఆపేస్తున్నారట.
ఆ ఇద్దరు మంత్రులు కోనసీమను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఏ నియోజకవర్గంలో ఏం జరగాలన్నా వారి అనుమతులు ఉండాల్సిదేనని కండిషన్ పెట్టారట. వారి అనుమతులు లేకుండా కోనసీమ జిల్లాల్లో చీమ కూడ చిటుక్కుమనడంలేదట. ఇక పనుల సంగతైతే మాట్లాడుకోకపోవడమే మంచిదంటున్నారు అక్కడి నేతలు. గత ఏడాదిన్నర కాలంగా వీరి వ్యవహారం చూస్తూ వస్తున్న ఎమ్మెల్యే చిట్టిబాబు ఇక తన వల్ల కాదని, తనకు అధిష్టానమే ఆదుకోవాలని వాపోతున్నారట. ఎమ్మెల్యే అయినప్పటి నుండి తన నియోజకవర్గంలో ఒక్క పనీ చేసుకోలేకపోతున్నానని, కనీసం అడుగు రోడ్డు కూడా వేయించలేకపోయానని, ఇంతోటి దానికి ఎమ్మెల్యేను కావడం ఎందుకని బహిరంగంగానే జిల్లా నేతలు వద్ద గోడు వెళ్లబోసుకున్నారట.
మొదటిసారి ఎమ్మెల్యే అయిన తన మీద నియోజకవర్గంలోని ప్రజలు చాలా అంచనాలు పెట్టుకున్నారని, కానీ తాను కనీసం అధికారుల వద్ద చేసుకోదగిన పనులు కూడ చేసుకోలేకపోతున్నాననేది ఆయన బాధట. చివరికి అధికారులను కూడ ఆ ఇద్దరు మంత్రులే కంట్రోల్ చేస్తుండటంతో ఎమ్మెల్యే అసహనం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రిని కలిసే వీలు లేదు కానీ లేకపోతే ఈపాటికే తాడో పేడో తేల్చమని జగన్ పేషీలోనే పంచాయతీ పెట్టుకునేవారట. ఎమ్మెల్యేలోని ఈ అసహనం చూస్తే ముందు ముందు ఆయన రెబల్ అయిపోతారనే అనుమానం కలుగుతోంది.