YS Jagan : కడుపు మంట.. ఎందుకంట.? జగన్ సూటి ప్రశ్న.!

YS Jagan : పేదలకు గతంలో పలు ప్రభుత్వాలు కేటాయించిన ఇళ్ళకు సంబంధించి వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని వైఎస్ జగన్ సర్కారు తెరపైకి తెచ్చిన సంగతి తెల్సిందే. పేదలపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతోపాటుగా, ఆయా ఇళ్ళకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు పేదలకే దక్కేలా ఈ సెటిల్మెంట్ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

అయితే, సెటిల్మెంట్ పేరుతో నయా దందాకి వైఎస్ జగన్ ప్రభుత్వం తెరలేపిందన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపించాయి. గత ప్రభుత్వాలు ప్రజలకు కేటాయించిన ఇళ్ళ నుంచి ఇప్పుడు సొమ్ముల్ని వసూలు చేయడమేంటన్నది విపక్షాల వాదన. ఈ వాదనలోనూ కొంత న్యాయం లేకపోలేదు.

అయితే, ప్రభుత్వాలకి బకాయి పడ్డ ఇళ్ళ నుంచి ఆ బకాయిల్లో కొంత మొత్తాన్ని వసూలు చేసేలా వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని వైఎస్ జగన్ సర్కార్ డిజైన్ చేసింది. కాగా, సంక్షేమ పథకాల పేరుతో బోల్డంత ఖర్చు చేస్తున్న వైఎస్ జగన్ సర్కార్, ఈ పథకాన్ని కూడా ఉచితంగానే తెరపైకి తెచ్చి వుంటే ఇన్ని వివాదాలు వచ్చి వుండేవి కావు.

తాజాగా, ఈ పథకాన్ని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రారంభించిన వైఎస్ జగన్, విపక్షాలపై విరుచుకుపడ్డారు. పేదవాడికి మేలు చేసే నిర్ణయాల్ని తమ ప్రభుత్వం తీసుకుంటోందనీ, విపక్షాలు మాత్రం అది చూసి ఓర్వలేక కడుపు మంటతో రగలిపోతున్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు.

ఇదిలా వుంటే, కొంతమంది వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం కోసం ముందుకొస్తుండగా, చాలామంది సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఈ నేపథ్యంలో పథకాన్ని ఉచితం చేయడమే మంచిదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.