పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ఒక్కసారే ఉంటుంది. కానీ.. ఈ మహిళ మాత్రం నిత్య పెళ్లి కూతురు. అందరూ ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదిస్తే.. ఈమె పెళ్లిళ్లు చేసుకొని డబ్బు సంపాదిస్తోంది. యువకులకు మాయమాటలు చెప్పి బుట్టలో పడేయడం.. పెళ్లి చేసుకోవడం.. వెంటనే అన్నీ సర్దుకొని జంప్ అవడం.. ఇదే ఆ మహిళ పని. కానీ.. ఏదైనా ఎక్కువ రోజులు దాగదు కదా. ఎట్టకేలకు ఆ నిత్య పెళ్లి కూతురు పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
మంచి ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించే కుర్రాళ్లే ఆ మహిళ టార్గెట్. తన అసలు పేరుతో కాకుండా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయించి.. ఆయా పేర్లతో చలామణి అవుతుంది. అమాయకులను బుట్టలో వేసుకుంటుంది.
ఆ నిత్య పెళ్లి కూతురు అసలు పేరు మాత్రం హరిణి. గత సంవత్సరం డిసెంబర్ లో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడిని వివాహమాడింది. ఆ తర్వాత అతడితో కలిసి హైదరాబాద్ వెళ్లి అక్కడ కాపురం పెట్టింది. అయితే.. తన భర్తకు విదేశాలకు వెళ్లే అవకాశం రావడంతో అతడు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటూ.. తన భార్యను కూడా తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ.. పాస్ పోర్ట్ లేదని చెప్పడంతో.. అతడొక్కడే వెళ్లాడు. కానీ.. తనపై ఎందుకో అనుమానం కలిగి.. నిఘా పెట్టాడు.
చివరకు తెలిసిందేంటంటే.. తన కంటే ముందు మరో ఇద్దరు యువకులను పెళ్లి చేసుకున్నదని తెలిసి కంగుతిన్నాడు ఆ వ్యక్తి. తన భార్య గురించి అన్నింటినీ ఆధారాలతో సహా తీసుకొచ్చి నిలదీశాడు. దీంతో.. ఓహో.. అసలు నిజం తెలిసిపోయిందా? అయితే.. 30 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకో.. అంటూ అతడినే డిమాండ్ చేసింది. రూపాయి కూడా ఇవ్వనంటూ అతడు తెగేసి చెప్పాడు. దీంతో తనను మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ లో అతడిపై కేసు పెట్టింది.
వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించగా.. తన పెళ్లిళ్ల బాగోతం తెలిసి అవాక్కయ్యారు. వెంటనే ఆ యువతిని అరెస్ట్ చేశారు.