రాజకీయాల్లో కొన్ని సర్వేలు వాస్తవమైనవి.. చాలా సర్వేలు కల్పితమైనవి వుంటాయి. ఏది కల్పితం.? ఏది వాస్తవం.? అన్నది తేల్చడం అంత తేలిక కాదు. ఇటీవల ఓ సర్వే వెలుగు చూసింది. అందులో వైఎస్ జగన్ పాపులారిటీ అత్యంత దారుణంగా పతనమైనట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఇమేజ్ గడచిన రెండేళ్ళలో చాలా డ్యామేజీ అయిపోయిందన్నది సదరు సర్వే సారాంశం. అయితే, ఈ సర్వేని వైసీపీ లైట్ తీసుకుంది. చిత్రమేంటంటే, అదే సర్వేలో వైసీపీకి.. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ ఓటింగ్‌ని పేర్కొనడం. ఇది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. కానీ, టీడీపీ ఓటు బ్యాంకు కాస్త పెరిగింది.. 2019 ఎన్నికలతో పోల్చితే. శాంపిల్స్ ఎలా తీసుకున్నారు.? అన్నది వేరే చర్చ. ఈ సర్వే ఫలితాలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా వున్నాయనీ, ఇంకో రెండేళ్ళలో వైసీపీ పూర్తిగా పతనమైపోతుందనీ టీడీపీ లెక్క కడుతోంది. నిజానికి, ఈ సర్వే చూసి మరీ అంతలా భయపడాల్సిన పనేమీ లేదన్నది వైసీపీ అభిప్రాయం. రాజకీయ విశ్లేషకులు కూడా వైసీపీకి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారు. అయితే, వైసీపీ ఇక్కడో విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
అదేంటంటే, ప్రజా వ్యతిరేకత నిజంగానే పెరుగుతోంది. దానికి చాలా కారణాలున్నాయి. కరోనా అతి ముఖ్యమైన కారణం. ఆ తర్వాత కింది స్థాయిలో నేతల వ్యవహారాలు. మంత్రులపైనా వస్తున్న అవినీతి సహా చాలా రకాల ఆరోపణలు. వీటన్నిటినీ వైసీపీ అధిష్టానం ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సి వుంటుంది. అధినేత మెప్పు కోసం వైసీపీ ముఖ్య నేతలు చేస్తున్న హంగామా, పార్టీకి ప్రజల్లో చెడ్డపేరు తెస్తోంది. ఇవన్నీ ఓ ఎత్తు అయితే, సంక్షేమ పథకాల భారం ఇంకో యెత్తు. అప్పుల కుప్పగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్.. అభివృద్ధి ఊసెత్తకుండా ఇంకెంతకాలం మనుగడ సాధించగలదు.? అన్న అనుమానం ప్రజల్లో పెరిగిపోతోంది. అలాగని, సంక్షేమ పథకాల్ని ఆపేస్తే ప్రజలు ఊరుకోరు. సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చుతాయనీ ఖచ్చితంగా చెప్పలేం. పాలనా వైఫల్యాల్నీ, పార్టీ పరమైన సమస్యల్నీ సరిదిద్దుకోవడానికి ఇలాంటి సర్వేలు అధికారంలో వున్నవారికి ఉపయోగపడ్తాయి.