TDP : టీడీపీ ఎగనాం పెడితే, అసెంబ్లీకేంటి నష్టం.?

 TDP : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని తాత్కాలికంగా బహిష్కరించేశారు. వైసీపీ అధికారంలో వున్నన్నాళ్ళూ ఆయన అసెంబ్లీకి వెళ్ళబోరట. ఈ విషయాన్ని ఆయన గతంలోనే ప్రకటించారు. తన భార్యను అసెంబ్లీలో కించపర్చారంటూ కన్నీరు పెట్టుకున్నా చంద్రబాబు అప్పట్లో.
అయితే, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయంటూ పలువురు టీడీపీ నేతలు, తమ అధినేతకు సూచిస్తున్నారట. కామెడీ కాకపోతే, గతంలో వైసీపీ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించింది. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళాయా.?
అసలు, ఎవరు అధికారంలో వుంటే వారు తప్ప, విపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిథులెవరూ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదన్న రూల్ ఏదన్నా పెట్టేస్తే బావుంటుందేమో.. అన్న చర్చ జనబాహుళ్యంలో జరుగుతోంది.
ఎందుకంటే, అసెంబ్లీ సమావేశాలంటే అధికార పార్టీ సొంత వ్యవహారంలా మారిపోయింది. చంద్రబాబు హయాంలోనూ, వైఎస్ జగన్ హయాంలోనూ ఇదే ఆరోపణ వినిపిస్తోంది. ఎవరు ముఖ్యమంత్రి పదవిలో వుంటే వారి భజనకు చట్ట సభలు పరిమితమవుతుండడం శోచనీయం. అసలు విపక్షాలు మాట్లాడేందుకు అవకాశం దొరికితే కదా.?
దొరికినా, విపక్షాలపై విరుచుకుపడేందుకు అధికార పార్టీ ప్రత్యేకమైన వ్యూహాలు సిద్ధం చేస్తోందాయె. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసీ మరీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ నిస్సిగ్గు రాజకీయాలు చేస్తున్న రోజులివి. చట్ట సభల్నీ అందుకు వేదికలు చేస్తే ఎలా.?
సరే, ఈ వైపరీత్యానికి కారణం ఎవరన్నది వేరే చర్చ. టీడీపీ, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవడం వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టం లేదన్నది నిష్టుర సత్యం. మరి, టీడీపీకి అది లాభం చేకూర్చతుందా.? అంటే, గతంలో వైసీపీకి లాభమే చేసింది గనుక, టీడీపీకి కూడా లాభమే కావొచ్చు.