Pawan Kalyan : గులాబీ పార్టీతో జనసేనాని ‘జత’ కలుస్తారా.?

Pawan Kalyan : రాజకీయ పరమైన ఆలోచనలు వేరు, రాజకీయ సిద్ధాంతాల పరంగా విభేదాలు వేరు.. కళా రంగం వేరు. ఒకదానితో ఇంకోదాన్ని కలగలిపేసి, రాజకీయ కక్ష సాధింపులు సబబు కాదు.. ఇదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనసులో మాట. మనసులో మాటే కాదు, ఆయన ఈ విషయాన్ని బాహాటంగానే వెల్లడించారు.

‘భీమ్లానాయక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని ఆహ్వానించిన పవన్ కళ్యాణ్, ఆయనతో తనకున్న ‘సోదర బంధం’ గురించి చెప్పుకున్నారు. రాజకీయంగా టీఆర్ఎస్ – జనసేన మధ్య వైరుధ్యాలున్నాయి. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇరువురి మధ్యా గతంలో నడిచాయి.. అడపా దడపా నడుస్తూనే వున్నాయి.

అయతే, సినీ పరిశ్రమకు సంబంధించి ‘పెద్దలు’ అంటూ పవన్ కళ్యాణ్ పేరుని కేటీయార్ ప్రస్తావించడం ద్వారా, ఒక్కసారిగా అంతా విస్మయానికి గురయ్యారు. పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పని చేయాలని పవన్ కళ్యాణ్‌కి పిలుపునిచ్చారు కేటీయార్. ఇది కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. అలాగని తప్పు పట్టే విషయం ఏమాత్రం కాదు.

చూస్తోంటే, ఇదంతా జనసేన తన మిత్రపక్షం బీజేపీని పక్కన పెట్టేలా కేటీయార్ ‘గేమ్ ప్లాన్’ వేశారని అనిపించకమానదు. నిజానికి, తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య అంత సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి జనసేన దగ్గరైతే, ఈక్వేషన్స్ మారతాయి. కానీ, ఏపీలో బీజేపీ – జనసేన బంధానికి ‘పగుళ్ళు’ మరింత ఎక్కువవుతాయి. కాదు కాదు, బీజేపీ – జనసేన ఏపీలో చెరోదారీ చూసుకోవాలి.