ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత రసవత్తరంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో ఏపీలో మొత్తంగా 81.79 శాతం నమోదైనట్లు ఎన్నికల కమీషన్ వెల్లడించింది. అందులో సాధారణ ఓటింగ్ 80.59 శాతంగా నమోదవ్వగా.. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్ గా ఉంది. ఏది ఏమైనా… ఇది మంచి స్కోరనే చెప్పాలి. ఏపీలో ఓటరు బాధ్యత గుర్తెరిగాడని.. తన అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నాడనే విషయం మాత్రం స్పష్టమైంది.
ఈ సమయంలో ఇప్పుడు ఫలితాలు తెలియాలంటే జూన్ 4వరకూ ఆగాల్సిన పరిస్థితి. మరోపక్క ఎగ్జిట్ పోల్స్ కి కూడా జూన్ 1 వరకూ అవకశం లేదు. ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. గెలుపు తమదంటే తమదంటూ బలంగా చెబుతున్నారు.. మరికొంతమంది బెట్టింగుల్లోనూ బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో పిఠాపురం నియోజకవర్గ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి.
అవును… ఏపీలోనే అత్యంత హాట్ నియోజకవర్గంగా పిఠాపురం నిలిచిందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ సమయంలో అత్యధిక శాతం ఓటింగ్ పోలవ్వడం.. యువత, ఉద్యోగులు ఎక్కువగా పోలింగ్ లో పాల్గొనడంతో… పవన్ గెలుపుపై జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ గేటు తాకుతారని ఘంటాపథంగా చెబుతున్నారు.
దీంతో… పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ సంచలన ఛాలెంజ్ చేసిన ముద్రగడ పద్మనాభాన్ని తీవ్రంగా ర్యాగింగ్ చేస్తున్నారు జనసైనికులు. ఇందులో భాగంగా… ముద్రగడకు పేరు మార్పు తప్పదని అంటున్నారు. ఈ మేరకు జూన్ 4వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు ముద్రగడ ఇంటివద్ద ఆయనకు బారసాల కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పోస్టర్లు వేసి ఆన్ లైన్ లో షేర్ చేస్తున్నారు.
ఈ లెక్కన చూసుకుంటే… పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే… ముద్రగడను మూరు చెరువుల నీళ్లు తాగించేసేలా ఉన్నారు జనసైనికులు! సపోజ్.. ఫర్ సపోజ్.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోతే. మెజారిటీ ఎంతైనప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాబోయే ఉప ముఖ్యమంత్రి వంగ గీత గెలిస్తే.. అప్పుడు జనసైనికుల పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది.
పైగా… పోలింగ్ అనంతరం జనసైనికులు తనను ఎంతగా ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలుస్తున్నా ముద్రగడ పద్మనాభం రియాక్ట్ కాకపోవడానికి కారణం ఇదే అని అంటున్నారు ఆయన అభిమానులు. ఇప్పుడు మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదని, అపరిపక్వతతో కూడిన రాజకీయాలు ఆయన చేయరని, జూన్ 4 సాయంత్రం ఆయన పెట్టబోయే ప్రెస్ మీట్ పిఠాపురం చరిత్రలో నిలిచిపోద్దని అంటున్నారు.
అందువల్ల… జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల్లో పవన్ గెలిస్తే ముద్రగడతో మూడు చెరువుల నీళ్లు తాగించేస్తారు జనసైనికులు! ఇదే సమయంలో వంగ గీత గెలిస్తే పవన్ కి ముద్రగడ పట్టపగలే అన్ని రకాల నక్షత్రాలు చూపిస్తారని అంటున్నారు!