పీఎఫ్.. అది ఏ ఉద్యోగం అయినా సరే.. పీఎఫ్ అకౌంట్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగం అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ కల్పించిన హక్కు పీఎఫ్ అకౌంట్. ఒకవేళ ఉద్యోగం పోయినా.. రిటైర్ అయినా.. కంపెనీ మూసేసినా.. ఏదైనా అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినా.. పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకొని అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
ఉద్యోగి పీఎఫ్ అకౌంట్ లో ఉద్యోగి బేసిక్ శాలరీలో కొంత కట్ చేసి, కంపెనీ కూడా తమవంతుగా ఉద్యోగి పీఎఫ్ అకౌంట్ లో జమ చేస్తుంది. పీఎఫ్ అకౌంట్ లో ఉన్న డబ్బుకు సంవత్సరానికి కొంత వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ డబ్బుకు సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ లభిస్తుంది.
అయితే.. చాలామంది పీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగం మానేసినా.. రిటైర్ అయినా తమ పీఎఫ్ అకౌంట్ లో ఉన్న డబ్బులను మాత్రం తీసుకోరు. వడ్డీ వస్తుంది కదా అని అలాగే ఉంచుతారు. కానీ.. దాని వల్ల వాళ్లు ఎంత లాస్ అవుతారో తెలుసా?
సాధారణంగా పీఎఫ్ డబ్బుల మీద వచ్చే వడ్డీకి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అది కూడా పీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేసి వరుసగా ఐదు సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అలా అయితే వడ్డీ మీద టాక్స్ ఉండదు. కానీ.. పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగి.. రిటైర్ అయిన తర్వాత కూడా తన పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకోకపోతే మాత్రం దాని మీద వచ్చే వడ్డీకి టాక్స్ కట్టాల్సి ఉంటుంది.
అందుకే.. రిటైర్ కాగానే వెంటనే పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకోవడం మంచిది. రిటైర్ అయ్యాక.. కంపెనీ నుంచి ఎగ్జిట్ డేట్ పీఎఫ్ ఆఫీసుకు అందగానే పీఎఫ్ విత్ డ్రా కోసం అప్లయి చేసుకోవాలి. ప్రస్తుతానికి ఓ ఉద్యోగి పదవీ విరమణ వయసు 58 గా ఉంది.
ఒకవేళ పీఎఫ్ అకౌంట్ కలిగి ఉండి.. ఉద్యోగం లేకపోతే.. రెండు నెలల్లో పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. అప్పుడు వడ్డీ మీద టాక్స్ పడదు.