సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించిన విక్రాంత్ మస్సే.. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న అభిమానులు!

మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో అద్భుతమైన నటనతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మస్సే 12 ఫెయిల్ సినిమాతో తెలుగు వాళ్ళకి కూడా బాగా దగ్గరయ్యాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతకి కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఆయన సినిమాలు మూడు సెట్స్ మీద ఉన్నాయి.

అయితే ఈ మధ్య విక్రాంత్ తన నటన నుంచి విశ్రాంతి తీసుకుంటానని కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో మంచి విజయాలు దక్కాయని, తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 2025 లో విడుదల కానున్న మూడు సినిమాలే తన చివరి సినిమాలని, తండ్రిగా కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చేందుకే ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో విక్రాంత్ ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. అయితే అలా పోస్టు పెట్టిన రెండు రోజులకే డెహ్రాడూన్ లో జరుగుతున్న ఒక షూటింగ్ లో పాల్గొనడంతో మరింత షాక్ అయ్యారు అతని ఫ్యాన్స్.

అయితే తన పోస్ట్ పై విక్రాంత్ వివరణ ఇచ్చాడు. పూర్తిగా సినిమాలు మానేస్తానని తాను ఎక్కడా చెప్పలేదని, కుటుంబం ఆరోగ్యం కోసమే కొన్ని రోజులు విరామం తీసుకుంటున్నానని మళ్లీ తాను ఎనౌన్స్ చేసే వరకు సినిమాలలో కనిపించని వెల్లడించాడు. ఈ విషయంలో అభిమానులు ఆందోళనకు గురి కావద్దని చెప్పారు. అయితే ఈ విషయంపై ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ఆయన చెప్పిన కారణం సరి అయినది కాదేమో అని, అయినా ఈ నిర్ణయం స్వచ్ఛందంగా తీసుకున్నారా లేదంటే ఆయన మీద ఎవరైనా ఒత్తిడి తీసుకువచ్చారా అంటూ పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. విక్రాంత్ ఇచ్చిన స్టేట్మెంట్ అబద్ధం కావాలని మళ్లీ అతను సినిమాలలో నటిస్తే బాగుండు అని కొందరు, త్వరగా వెనక్కి రండి మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇవి చూశాక అయినా విక్రాంత్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో చూడాలి.