Nani : తగ్గిస్తే అవమానమా.? ఎందుకు కెలుక్కున్నావ్ నానీ.!

Nani : నందమూరి బాలకృష్ణకి లేని సమస్య.. అల్లు అర్జున్‌కి లేని సమస్య.. నానికి మాత్రమే ఎందుకొచ్చింది.? సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గిస్తే, ప్రేక్షకుల్ని అవమానించినట్లు ఎలా అవుతుంది.? హీరో నాని, సినిమా టిక్కెట్ల ధరల విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా థియేటర్ నడపడం కంటే, ఆ థియేటర్ ఎదురుగా వున్న కిరాణా కొట్టు నడపడమే బెటర్.. అని నాని వ్యాఖ్యానించడాన్ని తప్పు పట్టలేం.

అయితే, ఈ క్రమంలో నాని చెప్పిన కథ మాత్రం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పిక్నిక్ కోసం అందరి నుంచీ వంద రూపాయల వసూలు చేసి.. ఒకరికి మాత్రం పది రూపాయలు ఇవ్వమంటే.. అది ఆ ఒక్క వ్యక్తిని అవమానించినట్లట. అదీ నాని చెప్పిన కథ. దాన్ని అవమానం అని ఎలా అనగలం.?

సినిమా టిక్కెట్ల ధరలు తగ్గితే, అది నిర్మాతలకో.. థియేటర్ల యాజమాన్యాలకో.. డిస్ట్రిబ్యూటర్లకో వర్కవుట్ కాదన్నది వేరే చర్చ. ఈ విషయమై ప్రభుత్వంతో సంప్రదింపులు జరపొచ్చుగాక. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతోంది కూడా. కోర్టు ఏం తేల్చుతుందన్నది ముందు ముందు తేలుతుంది.

రేపు ‘శ్యామ్ సింగారాయ్’ సినిమా రిలీజ్ పెట్టుకుని, నాని ఇలా ఎందుకు మాట్లాడినట్టు.? గతంలో నాని సినిమా ‘టక్ జగదీష్’ విషయంలోనూ ఇలాగే రచ్చ జరిగింది. ఏపీలో సినిమా థియేటర్లు పూర్తి సామర్థ్యంతో నడవని కారణంగా, సినిమాని ఓటీటీకి ఇచ్చేయాల్సి వచ్చిందని నాని చెప్పుకొచ్చిన సంగతి తెల్సిందే.

కాగా, నాని చేసిన ‘అవమానకర’ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. టిక్కెట్ ధరల్ని తగ్గిస్తే, ప్రేక్షకుడ్ని అవమానించినట్లెలా అవుతుందని ప్రశ్నించిన మంత్రి బొత్స, ఇష్టమొచ్చినట్లు టిక్కెట్ ధరల్ని పెంచకుండా నియంత్రించడం వల్ల ప్రేక్షకులకు మేలు కలుగుతుందని అన్నారు.