ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు చిక్కుల్లో పడ్డాయి. ప్రభుత్వం రెండోసారి జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లదని అంటూ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తంగా రద్దయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రద్దవుతాయని విశ్లేషకులు చెబుతున్న కారణాలు కూడా బలంగానే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఫిబ్రవరి 19న ఆర్డినెన్స్ జారీ చేసింది. అందులో ఎన్నికల ప్రక్రియను 15 రోజులకు కుదించారు. అలాగే ఎన్నికల్లో అభ్యర్థులు అవినీతికి పాల్పడ్డారని నిరూపించబడితే వారి పదవీకాలం ఐదేళ్లలో ఎప్పుడైనా వారిని తొలగించవచ్చని పెర్కొంది. ఈ ఆర్డినెన్సుకు అనుకూలంగానే ఈసీ రమేశ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ ప్రకారమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సర్పంచుల నామినేషన్ ప్రక్రియ మొదలుకావలసి ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలు రద్దైనట్టేనా.. నిమ్మగడ్డ ఏం చేస్తారు?
కానీ ఈలోపు కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. ఆ తర్వాత నిమ్మగడ్డను తొలగించడం, ఆయన కోర్టుకు వెళ్ళడం, కోర్టు తీర్పును సైతం సర్కార్ నిర్లక్ష్యం చేయడం అటుపైన సుప్రీం కోర్టులో పిటిషన్లు, చివరికి గవర్నర్ ఆదేశాలతో నిమ్మగడ్డ నియామకం జరిగాయి. ఆర్డినెన్స్ కాలపరిమితి 6 నెలలు కాగా ఈలోపు అసెంబ్లీ సమావేశమై 6 వారాల్లోపు ఆర్డినెన్సు బిల్లును ఆమోదించుకోవాలి. లేకపోతే ఆర్డినెన్సు కాలం చెల్లిపోతుంది. జూలై 16న సమావేశమైన అసెంబ్లీ ఆర్డినెన్సు బిల్లును ఆమోదించుకుంది. కానీ మండలిలో ప్రవేశపెట్టలేకపోయింది.
మండలి జరిగినన్ని రోజులు మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు వంటి బిల్లుల మీద గొడవలతో సరిపోయింది. ఆ గొడవల్లో పడి ప్రభుత్వం ఆర్డినెన్సు బిల్లును ప్రవేశపెట్టలేదు. దీంతో ఆర్డినెన్సు కాలపరిమితి ఆగష్టు 20కి ముగియనుంది. దీంతో అధికారులు మంగళవారం ఆర్డినెన్స్ 6ను జారీ చేశారు. ఆర్డినెన్స్ 2 జూలై 27తో కాలం చెల్లిందని అంటూనే పాత ఆర్డినెన్స్ ఇంకా అమలులో ఉందని చెబుతూ మరో ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇలా ఒకే అంశం మీద రెండు ఆర్డినెన్సులు చెల్లవని రాజ్యాంగం చెబుతోంది. ఈ అంశమే కోర్టుకు వెళితే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియను ఎక్కడ ఆగిందో అక్కడి నుండి కొనసాగించాల్సి ఉంది. అలా చేస్తే ఈ నెల 20లోపు ఎన్నికలు పూర్తి కావాలి. కరోనా దృష్ట్యా అది అసాధ్యం. కాబట్టి మొత్తంగా ప్రక్రియ రద్దు కావాల్సిందేనని అంటున్నారు నిపుణులు. ఇన్ని అనుమానాల మధ్యలో అసలు ఈసీగా నిమ్మగడ్డ నిర్ణయం ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది అందరిలో.