టైసన్‌తో ఫైట్: గుండెల్లో గుబులు పుట్టేస్తోందంటోన్న రౌడీ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’. క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్యాన్ ఇండియా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మేకోవర్ అద్భుతహ.. అంటూ ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

బాక్సింగ్ ఐకాన్ మైక్ టైసన్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ దిగ్గజంగా అందరికీ సుపరిచితుడైన మైక్ టైసన్ తొలిసారిగా నటిస్తున్న ఇండియన్ చిత్రం ఇది. టైసన్‌తో విజయ్ దేవరకొండ యాక్షన్ సీక్వెన్సే ఈ సినిమాకి ప్రాణం. అందుకే ఆ యాక్షన్ ఘట్టాల చిత్రీకరణకు చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది చిత్ర యూనిట్.

ఇకపోతే, టైసన్‌తో బాక్సింగ్ అంటే గుండెల్లో గుబులు పుడుతోందంటున్నాడు మన రౌడీ విజయ్ దేవరకొండ. ఆయన గురించి, ఆయన ఆట గురించి చిన్నప్పటి నుండీ వింటూ వస్తున్నాననీ, ఆయన పిడిగుద్దులు తిన్నవారు లేచి తిరగడం అంటే అంతే సంగతి.. అందుకే ఆయనతో ఫైట్ అంటే ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే.. అని రౌడీ చెబుతుండడం విశేషం. అంటే, ఈ సినిమాని రౌడీ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడని అర్ధమవుతోంది.

ప్రస్తుతం అమెరికాలో టైసన్ – విజయ్ దేవరకొండ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో బిజీగా ఉంది చిత్ర యూనిట్. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యా పాండే ఈ సినిమాలో రౌడీకి జంటగా నటిస్తోంది.