ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర జూన్ 27న ఘనంగా ప్రారంభం కానుంది. లక్షలాది భక్తులు తరలివచ్చే ఈ పవిత్ర రథోత్సవాన్ని ప్రశాంతంగా, భద్రంగా నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంది. సుమారు 10 వేల భద్రతా సిబ్బంది పూరీకి మొహరించినట్లు తెలుస్తోంది. ఈ భద్రతా సిబ్బందిలో ఒడిశా పోలీసులతో పాటు, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలు కూడా పాల్గొంటున్నాయి. మొత్తం 200 పోలీస్ ప్లాటూన్లు పూరీ నగరంలో విస్తరించి రథయాత్ర రోజుల్లో భద్రతను పర్యవేక్షించనున్నాయి. తొలిసారిగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) స్నైపర్‌లు బడా దండ వీధుల్లోని భవనాలపై మోహరించబడ్డారు.
ఇక సముద్రతీర భద్రత విషయంలోనూ చురుకుగా వ్యవహరిస్తోంది ఒడిశా ప్రభుత్వం. మెరైన్ పోలీసులు, ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్ విమానాల ద్వారా నిఘా కొనసాగించనుంది. అనుమానాస్పద చలనం ఏదైనా కనిపించినా వెంటనే స్పందించేందుకు డ్రోన్లు, యాంటీ డ్రోన్ టెక్నాలజీ, డాగ్ స్క్వాడ్లు సిద్ధంగా ఉన్నాయి.
రథయాత్ర సమయంలో జనసమూహ నియంత్రణ, రథాల చుట్టూ కార్డన్, ట్రాఫిక్ నిర్వహణ, ఆలయం లోపల మరియు వెలుపల భద్రత వంటి అంశాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇందుకోసం పూరీ నగరంలోనే తొలిసారిగా 275 ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాల నుంచి వచ్చే లైవ్ ఫీడ్‌ను పూరీ కోణార్క్ మధ్య ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలూ పర్యవేక్షించనున్నారు.
భక్తుల సౌకర్యార్థం ఒక ప్రత్యేక రియల్ టైం చాట్‌బాట్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది పార్కింగ్ లొకేషన్, వాహన రూట్ మ్యాపింగ్, ఖాళీ పార్కింగ్ ప్రాంతాలకు దారి చూపడం వంటి సమాచారాన్ని చక్కగా అందిస్తుంది. ముందస్తు అంచనాల ప్రకారం, మొదటి రెండు రోజులలోనే 15 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందని ఒడిశా డీజీపీ వై.బీ. ఖురానియా తెలిపారు.
భద్రతతోపాటు వైద్య సేవలకూ పెద్దపీట వేసిన ప్రభుత్వం, ఈ ఏడాది రథయాత్ర సందర్భంగా 69 తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు, 64 అంబులెన్స్‌లు, 265 ప్రత్యేక ఆసుపత్రి పడకలు, 378 అదనపు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది విధుల్లో నిమగ్నమవుతున్నారు. ఏఐఎమ్ఎస్ భువనేశ్వర్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఈసారి పూరీకి వస్తున్నారు. రథయాత్రను భద్రంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సుస్థిర చర్యలు భక్తుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అత్యంత పురాతనమైన, పుణ్యమైన ఈ ఉత్సవాన్ని ప్రపంచం మొత్తం నుంచి లక్షలాది మంది ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధమవుతున్నారు.