పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగడం అనేది ఎప్పటినుంచో నడుస్తున్న ‘సంప్రదాయం’. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా పలు సందర్భాల్లో అంగీకరించారు. అయితే, పరిధి దాటి జరిగే ఏకగ్రీవాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఆయా జిల్లాల్లోని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎస్ఈసీ. ఇంకోపక్క, ప్రశాంతమైన పల్లెల్లో రాజకీయ చిచ్చు రేగకూడదంటే, ఏకగ్రీవాలే సరైన మార్గమని అధికార వైసీపీ భావిస్తోంది. కానీ, అధికారంలో వున్నవారికి ఏకగ్రీవాలు సులువు కావడంతో, బలవంతపు ఏకగ్రీవాలంటూ.. అధికార పార్టీ మీద మండిపడుతోంది టీడీపీ. ఇదిలా వుంటే, గతంతో పోల్చితే, ఈసారి ఏకగ్రీవాలు చాలా ఖరీదైన వ్యవహారాలుగా మారిపోయాయి.
ఓ పంచాయితీలో ఓటు కోసం 8 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయలు ఖర్చు చేసిన ఓ పార్టీ మద్దతుదారుడు, సదరు పంచాయితీని ఏకగ్రీవం చేసుకున్నాడంటూ మీడియాలో కనిపిస్తున్న వార్త అందర్నీ విస్మయానికి గురిచేసింది. సాధారణ ఎన్నికల్లో కూడా ఈ స్థాయిలో ఓట్ల కోసం ఖర్చుపెట్టడం జరగదు. అదే మరి, పంచాయితీ ఎన్నికలంటే. 8 వేలు కాదు, 10 వేలు.. అవసరమైతే అంతకన్నా ఎక్కువే ఖర్చపెట్టడానికి కొన్ని గ్రామాల్లో ‘పెద్దలు’ ప్రయత్నిస్తున్న వైనం గురించి సోషల్ మీడియాలో ఆసక్తకిరమైన చర్చ జరుగుతోంది. కాగా, తొలి దశ ఏకగ్రీవాలపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేస్తున్న దరిమిలా, అధికార పార్టీ.. ఈ ఏకగ్రీవాల కారణంగా ఆర్థికంగా బాగా నష్టపోయిందనే ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లాకి చెందిన అధికార పార్టీ ముఖ్య నేత ఒకరు, కోట్లలో ఖర్చు చేశారనీ, తద్వారా ఆ జిల్లాలోనే అత్యధిక ఏకగ్రీవాలు జరిగాయనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘అంత ఖర్చు చేసినా, అనుకున్న స్థాయిలో ఏకగ్రీవాలు చేసుకోలేకపోయారు..’ అంటూ ఆయన గురించి అధికార పార్టీలోనూ చర్చ జరుగుతోందట. తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని చోట్ల ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని అంటున్నారు. బీజేపీ సైతం ఖర్చు బాగానే పెడుతోందంటూ వైసీపీ అనుకూల మీడియాలో కథనాలొస్తున్నాయి. ఎలా చూసుకున్నా, సార్వత్రిక ఎన్నికల కంటే ఖరీదైన వ్యవహారంగా పంచాయితీ ఎన్నికలు మారడంతో.. కొందరు నాయకులు ‘మేం నిండా మునిగిపోతున్నాం’ అని లోలోపల బాధపడాల్సి వస్తోందట. గట్టగా పైకి చెప్పుకోలేని పరిస్థితి ఇది.