చాన్నాళ్ళ క్రితం.. అంటే, ఓ రెండున్నర దశాబ్దాల క్రితం ‘ఎంఎస్ఎం’ అనే చర్చ స్టూడెంట్స్‌లో ఎక్కువగా వినిపించేది. ‘మార్చి తప్పితే సెప్టెంబర్.. సెప్టెంబర్ కూడా తప్పితే మళ్ళీ మార్చి..’ అనేది ఆ ‘ఎంఎస్ఎం’ కథ. పరీక్షలకు సంబంధించిన వ్యవహారమది.
ఆంధ్రప్రదేశ్ రాజధానుల విషయంలోనూ కథ అలాగే తయారైంది. అదిగదిగో మూడు రాజధానులంటూ అధికార వైసీపీ నానా హంగామా చేస్తోంది. మొన్నామధ్య సంక్రాంతి అన్నారు, అంతకు ముందు దసరా అన్నారు.. కొద్ది నెలల క్రితమే ‘శ్రావణమాసం’ మంచి ముహూర్తాలన్నారు. ఇప్పుడేమో మళ్ళీ వ్యవహారం విజయదశమికి వెళ్ళింది.
‘చంద్రబాబు జేజెమ్మ దిగొచ్చినా, మూడు రాజధానుల్ని ఎవరూ ఆపలేరు..’ అంటూ మంత్రులే సెలవిస్తున్నారు చంద్రబాబు ఎందుకు ఆపాలి.? ఆపుతున్నది వైసీపీనే కదా.! ఔను, మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్నది వైసీపీనే. ఇందులో డౌటేముంది.? మళ్ళీ బిల్లు పెట్టకుండా మీనమేషాల్లెక్కెడుతున్నదీ వైసీపీనే. ఆ లెక్కన మూడు రాజధానులు ఆలస్యమవడానికి కారణం ముమ్మాటికీ వైసీపీనే.. అన్న భావన జనంలోకి వెళ్ళిపోయింది.
అసలు మూడు రాజధానులు ఎందుకు.? అన్న చర్చ జనంలో జరుగుతోంది. ఔను, మూడు రాజధానులపై ప్రజలకు అవగాహన కల్పించకుండా, ప్రభుత్వమే నిర్ణయం తీసేసుకుని.. ఇదిగో ఇలా తప్పులో కాలేసిందన్నమాట. ‘మూడు రాజధానులకు ముహూర్తం విజయదశమి..’ అంటూ వైసీపీ అనుకూల మీడియా కొత్తగా కథనాలు షురూ చేసింది.
ఇదే వైసీపీ అనుకూల మీడియా, గంతంలో ‘విజయదశమి మంచి పండగ కాదు..’ అంటూ విశ్లేషించిన వైనాన్ని ఎలా మర్చిపోగలం.? అది, అమరావతిని రాజధానిగా అప్పటి చంద్రబాబు సర్కారు నిర్ణయించిన సమయంలో జరిగిన విశ్లేషణ. రోజులు మారాయ్. ఇది వైసీపీ పాలనా కాలం. అందుకే, ఇప్పుడు ఏదైనా మంచి రోజే.. మంచి సమయమే.. అన్నట్టు తయారైంది పరిస్థితి.
మూడు రాజధానులకు సంబంధించి వైఎస్ జగన్ సర్కారు ముందు ఓ బెస్ట్ ఆప్షన్ వుంది. శాసన రాజధానిగా అమరావతిలో చిన్నా చితకా పనులైనా ప్రారంభించి, ఆ తర్వాత న్యాయ రాజధాని అలాగే కార్య నిర్వాహక రాజధానిపై ఫోకస్ పెట్టడం. ఆ ఒక్కటి మాత్రం చేయలేకపోతోంది వైసీపీ సర్కారు. అందుకే, రానున్న విజయదశమి అయినా, ఆ తర్వాత వచ్చే సంక్రాంతి అయినా.. ఏదీ సరైన సమయం కాదు.. మూడు రాజధానులకు సంబంధించి.
వచ్చే ఎన్నికల వరకూ ఈ కథ ఇలాగే సాగుతుంది. ఆ తర్వాత అలవాటైపోతుందంతే.