అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు, టీడీపీ అధినేత, నేతలు, నాయకులు ఎలాంటి నిరసనలు చేపట్టారో తెలిసిందే. రోడ్లపైనే వంటా వార్పు..నిరాహార దీక్షలతో నిరసనను తెలిపారు. లాక్ డౌన్ ముందు తెలుగు రాష్ర్టాల్లో ఇదే హాట్ టాపిక్. జగన్ సర్కార్ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ర్టానికి మూడు రాజధానులు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి నానా యాగీ చేయించారు. చంద్రబాబు నాయుడు రోడ్డెక్కి జోలి పట్డడం..ఆయన భార్య భువనేశ్వరి గాజులు ఇవ్వడం వంటి కార్యక్రమాలతో రాజకీయం వేడెక్కింది. కానీ చివరికి కరోనా వైరస్ రావడంతో నిరసనలన్నీ ఒక్కసారిగా చల్లారిపోయాయి.
లాక్ డౌన్ సమయంలోనూ చిలవలు ఫలవలుగా భౌతిక దూరం పాటిస్తూ కొంత మంది నిరసనలు తెలిపే సాహసం చేసారు గానీ, పోలీసులు లాఠీలు ఝుళిపంచడంతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం విజయవాడ-గుంటూరు మధ్య ప్రశాంత వాతావరణం ఉంది. ఎలాంటి హడావుడి చేయకుండా అంతా సైలెంట్ గా ఉన్నారు. పనిలో పనిగా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలు కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అటుపై రాష్ర్టంలో చోటు చేసుకున్న పరిస్థితులతో రాజధాని మ్యాటర్ పూర్తిగా డీవియేట్ అయిపోయింది. ఎంత రాద్దాంతం చేసినా జగన్ వినిపించుకోరని డిసైడ్ అయిపోయారు. మండలిలో తాత్కాలికంగా మూడు రాజధానుల బిల్లుకైతే అడ్డు తగులుతున్నారు గానీ! రేపో మాపో బిల్లు పాస్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది.
అయితే తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాజధాని విషయాన్ని గుర్తు చేయడం విశేషం. తుళ్లూరు గ్రామ పర్యటనలో భాగంగా గల్లాకి ఈ విషయం గుర్తొచ్చింది. రాజధాని అమరావతి ఉద్యమం ధృడసంకల్పంతో ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేసారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే అక్కడ తన గళాన్ని వినిపిస్తానని తెలిపారు. రైతులకు తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేసారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం రాజధాని విషయంపై మళ్లీ ఎక్కడా స్పందించకపోవడం విశేషం. ఇటీవలి జరిగిన మహానాడు సభలోనూ రాజధాని మ్యాటర్ ని తూతూ మంత్రంగానే ముగించారు.