రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీద రాజకీయ విమర్శలు చేయడంలో తప్పుండకపోవచ్చేమో. ఎందుకంటే, ఇప్పుడు వ్యవస్థలు అలా తగలడ్డాయి. కానీ, ఎన్నికల్ని బహిష్కరించడమేంటి.? నలభయ్యేళ్ళ రాజకీయం చంద్రబాబుకి నేర్పింది ఇదేనా.? జయలలిత కూడా స్థానిక ఎన్నికల్ని బహిష్కరించారంటూ తాను చేస్తున్న పనిని చంద్రబాబు సమర్థించుకోవచ్చుగాక. కానీ, ప్రతిపక్షం.. తన సత్తా చాటుకోవాలంటే, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రావాలంటే.. ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి తీరాలి. పైగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలంటే అత్యంత ప్రతిష్టాత్మకం ఏ రాజకీయ పార్టీకి అయినా.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలోనూ స్థానిక ఎన్నికల పక్రియలో అరాచకాలు సాగాయి. రేప్పొద్దున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహానీ హయాంలోనూ జరగొచ్చుగాక. రాజకీయాల్లో ఇదొక నిరంతర పక్రియ. అంతమాత్రాన ఎన్నికల్ని బహిష్కరిస్తే.. టీడీపీ రాజకీయ భవిష్యత్తుకే సమాధి కట్టినట్లన్న కనీస పాటి ఆలోచన చంద్రబాబు చేయలేకపోవడమేంటి.? అధికార పార్టీ మరింత సులువుగా ఇకపై ఏకగ్రీవాలు చేసేసుకోగలుగుతుంది చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా. పార్టీ వైఫల్యాల్ని, వ్యవస్థ వైఫల్యాలుగా చెప్పడం చంద్రబాబుకి అలవాటే. ఇప్పుడూ ఆయన అదే చేస్తున్నారు. పార్టీ శ్రేణులకు పార్టీ మీద నమ్మకం లేదు. సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన పంచాయితీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక విషయంలోనూ చంద్రబాబు చూసీ చూడనట్టే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. కొత్త నాయకత్వం గ్రామాల నుంచి, మండలాల నుంచి, పరిషత్తుల నుంచే వస్తుంది. ఇది కూడా తెలియకుండా చంద్రబాబు, బహిష్కరణాస్త్రం ప్రయోగిస్తే.. అది పార్టీ మనుగడకే ప్రమాదకరం.