జగన్ సర్కార్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతల్ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో పాల్పడిన అక్రమాలను ఒక్కొక్కటిగా తవ్వుతూ చట్ట పరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. ఇంకా వైకాపా దగ్గర టీడీపీ నేతలకు సంబంధించి పెద్ద లిస్టే ఉంది. కీలక నేతలంతా హిట్ లిస్టు లో ముందున్నారు. ఆ అరెస్ట్ లను టీడీపీ తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వైకాపా అవినీతి పరులను టీడీపీ బయటకు లాగుతోంది. అవినీతికి పాల్పడ్డారా? లేదా? అన్నది పక్కనబెడితే ఆరోపణలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.
ఈ విషయంలో ఇప్పటికే జగన్, విజయసాయి రెడ్డి పేర్లను టీడీపీ ప్రస్తావించింది. 108 అంబులెన్స్ వాహనాల కొనుగోళ్లపై విజయ సాయి కోట్ల రూపాయలకు కుంభకోణానికి పాల్పడినట్లు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెట్టి పట్టాభిరామ్ ఆరోపించారు. తాజాగా సరస్వతి ఇండస్ర్టీ పేరు తో వైఎస్ భారతిని వివాదంలోకి లాగుతున్నారు. 2008 జులై లో జరిగిన సరస్వతి పవర్ ఇండస్ర్టీస్ కు సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ లో సిమెంట్ పరిశ్రమలు కూడా నిర్వహించుకునేలా బైలాస్ లో సవరణ తెచ్చారన్నారు. కానీ అంతకు ముందే జూన్ 2008 న మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన మెమో ఆధారంగా సరస్వతి పవర్స్ అండ్ ఇండస్ర్టీకి గనులు కేటాయించినట్లు జీవో నెం 107 లో పేర్కొన్నారని ఆరోపించారు.
అంటే బైలాస్ లో సిమెంట్ కంపెనీ ప్రస్తావన రాకముందే సిమెంట్ కంపెనీకి, భూ కేటాయింపులకు సంబంధించిన ఫైల్ కదిలించారని చెప్పడం. ఈ ఫైల్క్ – భారతికి సంబంధం ఏంటంటే? సరస్వతి ఇండస్ర్టీలో వాటాలున్నాయని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్నారని, ఆయన సతీమణి భారతికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు అనెక్జర్ -2లో తెలిపారని పట్టాభి అంటున్నారు. మరి ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం ఉంటే భారతి కూడా అవినీతికి పాల్పడినట్లే అవుతుంది.