సినిమా పాటలకు సంబంధించి చాలామంది సినీ కవులు తమదైన పదజాలాన్ని ప్రస్తుత వ్యవస్థలోని కుళ్ళుపై అస్త్రాలుగా సంధిస్తుంటారు. అలా సంధించేవారిలో అతి కొద్దిమంది తమదైన ప్రత్యేకతను చాటుకుంటుంటారు. పాట ద్వారా సమాజంలో చైతన్యం నింపాలని ప్రతిసారీ ప్రయత్నించడం చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంటుంది.
అలాంటి కొద్దిమంది వ్యక్తుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. సీతారామశాస్త్రి రాసిన చాలా పాటలు, సమాజాన్ని మేల్కొలిపేలా వుంటుంది. ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత రాజకీయాల్లో మార్పు కోసం సిరివెన్నెల పడే తపన ఆయన పాటల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది.
అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని.. అంటూ ప్రశ్నించినా, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అని నిలదీసినా, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని.. అని కళ్ళెర్రజేసినా.. అది సిరివెన్నెల సీతారామశాస్త్రికే చెల్లిందేమో.
ఒకటా.? రెండా.? పదుల సంఖ్యలో కనిపిస్తాయి ఇలాంటి పాటలు. ప్రతిసారీ సమాజాన్ని ఆయన ప్రశ్నించేందుకే ప్రయత్నిస్తుంటారు. సమాజంలో బద్ధకాన్ని నిలదీస్తారు. ప్రధానంగా యువతను చైతన్యపరిచేందుకు సిరివెన్నెల చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఆయన చిత్తశుద్ధి అద్భుతం.. అమోఘం.
‘నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గు లేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని..’ అంటూ సిరివెన్నెల సంధించిన పాటాస్త్రం, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. వెరీ వెరీ స్పెషల్ అంతే.
రాజకీయ వ్యవస్థని నేరుగా సిరివెన్నెల ప్రశ్నించినా, రాజకీయ వ్యవస్థలోని కుళ్ళుని ఆయన నిలదీసినా.. ఆయన్నెవరూ తప్పు పట్టలేరు. ఎందుకంటే, ఆయన సంధించిన అస్త్రమలాంటిది. ఓ సారి విని ఊరుకుందామని అనుకోలేం.. ఎందుకంటే, సిరివెన్నెల సంధించే ప్రశ్నలు, గుండె లోతుల్లోకి వెళ్ళిపోతాయ్. దటీజ్ సిరివెన్నెల.