Tharun Bhascker: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః. A R సజీవ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మించగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ గా నిలిచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో తరుణ్ భాస్కర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
రిమేక్స్ పూర్తిగా తగ్గిపోతున్న ఈ సందర్భంలో ఈ సినిమాతో ఇంత మంచి రెస్పాన్స్ అందుకోవడం ఎలా అనిపించింది?
-చాలా హ్యాపీగా ఉండండి. సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూసిన ఆడియన్స్ ఒరిజినల్ గా ఫీల్ అవుతున్నారు. కనెక్ట్ అవుతున్నారు. రీమేక్ అని సింపుల్ గా అనేయడం చాలా ఈజీ. కాకపోతే మేము ఈ సినిమా కోసం చాలా వర్క్ చేసాం. మన తెలుగు నేటి వేటికి తగ్గట్టు గోదావరి ప్రాంతాలకు తగ్గట్టు అడాప్టేషన్ చేసుకున్నాము. ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి కథ కావాలి. అలాంటి కథ ఇచ్చినప్పుడు ఆడియన్స్ కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారని ఈ సినిమా మరోసారి నిరూపించింది.

మీరు ఒక దర్శకుడు కదా.. యాక్టర్ గా చేస్తున్నప్పుడు మీ వైపు నుంచి ఎలాంటి సజెషన్స్ ఉంటాయి?
-ఒక క్రియేటివ్ వర్క్ చేస్తున్నప్పుడు సలహాలు సూచనలు అవసరమే. కాకపోతే వాటిని ఎక్కడ కట్ చేయాలి అనేది మనకి తెలిసి ఉండాలి. డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే వింటాను. అవసరమనిపిస్తే తీసుకుంటాను. కానీ ఒక పరిధి దాటి అవి వచ్చాయంటే కచ్చితంగా మనలో ఒక సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది. ఒక నటుడిగా ప్రాజెక్టు ఒప్పుకున్న తర్వాత నేను కేవలం నటనకే పరిమితం అవుతాను. కొంతమంది నాకు సలహాలు సూచనలు అడిగినా సరే ఇవ్వడానికి పెద్దగా ఇష్టపడను. ఎందుకంటే ఒక దర్శకుడిగా నా యాక్టర్ ఎలా ఉండాలని నేను ఫీల్ అవుతానో, ఒక యాక్టర్ గా చేస్తున్నప్పుడు అలాగే ఉంటాను. నేను నటిస్తున్నప్పుడు మానిటర్ కూడా చూడను. డైరెక్టర్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తాను. ఈ సినిమా క్రెడిట్ అంతా డైరెక్టర్ సజీవ్ దే.
-ఒక నటుడిగా దర్శకుడిగా కొన్ని విషయాల్లో క్లారిటీ ఉంది. ఒక సీన్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ అని మనం అనుకుంటాం. అది కేవలం మన దృష్టిలోనే పర్ఫెక్ట్. ఆడియన్స్ కి నచ్చుతుందా లేదా అనేది మన చేతుల్లో ఉండదు. మనం చెప్పినట్టు చేస్తేనే బాల్ బౌండరీ దాటుతుంది అనేది ఈగో మాత్రమే. అది రియాలిటీ కాదు. మనకు కొన్ని సినిమాలను నచ్చవు, కానీ అవి బ్లాక్ బస్టర్ అయి ఉంటాయి. ఇక్కడ మన టేస్టే కరెక్ట్ అన్నది చాలా రాంగ్ పర్స్పెక్టివ్. అలాంటి పర్స్పెక్టివ్ ని నేను ఎవరి మీద రుద్దను.

ఓంకార్ నాయుడు పాత్ర మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
-ఈ క్యారెక్టర్ కోసం చాలా హోంవర్క్ చేశాను. యాస విషయంలో కానీ బాడీ లాంగ్వేజ్ లో కానీ అలాగే బిహేవియర్ లో కానీ ఇది నా పర్సనల్ లైఫ్ కి చాలా డిఫరెంట్ గా ఉండే క్యారెక్టర్. ఓంకార్ నాయుడు పాత్ర చాలా భిన్నమైనది. తనకి చేపలు వ్యాపారం ఉంటుంది. అలాగే తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్నంతా తనే మోస్తున్న ఫీలింగ్ లో ఉంటాడు. ఆ క్యారెక్టర్ పట్టుకోవడానికి చాలా హోంవర్క్ చేశాను. ఆ ప్రాసెస్ లో చాలా ఎంజాయ్ చేశాను.
-ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇది మోస్ట్ సాటిస్ఫైయింగ్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. యాక్టింగ్ వృత్తి మీద నాకు చాలా గౌరవం పెరిగింది
బ్రహ్మాజీ గారితో మీ సీన్స్ చాలా అద్భుతంగా పడ్డాయి.. ఆ ఎక్స్పీరియన్స్ గురించి?
-బ్రహ్మాజీ గారు నాకు రోల్ మోడల్. చంద్రలేఖలో ఆయన చేసిన నటన నాకు ఎంతో ఇష్టం. అందులో ఒక పాట కోసం ఎన్నోసార్లు థియేటర్ కి వెళ్లారు. ఆయనకి నటనలో మంచి యీజ్ ఉంటుంది. ఆయనతో కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా గొప్ప అనుభూతి. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. మా క్యారెక్టర్స్ మధ్య ఒకవైబ్ మ్యాచ్ అయింది.

ఇందులో గోదావరి యాస కోసం ఎలాంటి హోంవర్క్ చేశారు?
-నేను పుట్టి పెరిగిందంతా తెలంగాణ. ఓంకార్ నాయుడు పాత్ర గోదావరి యాస మాట్లాడాలి. నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగన వర్మ అనే స్నేహితుడు యాస విషయంలో నాకు మంచి రిఫరెన్స్ పాయింట్. అలాగే వినోద్ గారు అనే లాంగ్వేజ్ కోచ్ వున్నారు. ఆయన అన్ని ఆడియో నోట్స్ పంపించారు. అలాగే ఇక్కడ ఉన్న వాతావరణం గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. ఫుడ్ కల్చర్ కూడా పరిచయం చేశారు. ఒకటి రెండు రోజుల తర్వాత ఆ యాస కంప్లీట్ ఫ్లోలో వచ్చేసింది.
ఈషా రెబ్బ గురించి?
-ఈషాతో ఎప్పటినుంచో వర్క్ చేయాలి అనుకున్నాను. తను అద్భుతమైన నటి. ఎమోషనల్ గా చాలా సైలెంట్ క్యారెక్టర్. డైలాగ్ ద్వారా ఎమోషన్ చెప్పడం ఈజీ. డైలాగ్ లేకుండా ఎమోషన్ చూపించడం అనేది చాలా టఫ్. తను ఆ పాత్రను చాలా అద్భుతంగా చేసింది. తనకి మార్షల్ ఆర్ట్స్ కూడా తెలుసు. అది ఈ సినిమాకి మరింత కలిసి వచ్చింది.

-ఒక సీన్ లో తనని నిజంగానే కొట్టాలి. డైరెక్టర్ కొడితేనే ఆ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పాడు. తనకి తెలియకుండానే నిజంగా కొట్టాను. పాపం తను ఏడ్చేసింది. ఆ షాట్ సింగిల్ టేక్ లో ఓకే అయింది కాబట్టి మేము అందరం బ్రతికిపోయాం. రీటేక్ అని చెప్పి ఉంటే మాత్రం ఉంటే మాత్రం కష్టమే(నవ్వుతూ)
దర్శకుడిగా మీ నుంచి ఆడియన్స్ ఎక్కువ సినిమాలు ఆశిస్తున్నారు.. ఈ విషయంలో డీలే అవుతుందనే భావన ఉందా ?
-నేను కూడా అంచనాలు వేసుకున్నాను. నేను ఏ సంవత్సరంలో వచ్చాను, ఏ ప్రాజెక్ట్ చేశాననేది పేపర్ పై రాసుకున్నాను నాతోపాటు వచ్చిన డైరెక్టర్స్ అందరూ చూసుకుంటే నేను వెనకబడ్డట్టుగా ఏమి అనిపించలేదు. నాలుగు సినిమా చేశాను. ఇంకో సినిమా సైనప్ లో ఉంది. టీవీ షో, ఇతర సినిమాలు కు డైలాగ్స్, కథ ఓకే చేసి ప్రొడక్షన్ చేయించడం, నటించడం చాలా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ జర్నీ మీద నాకు ఎలాంటి రిగ్రేట్ లేదు. ఈ ఏడాది నేను నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. వీటి తర్వాత నేను దర్శకత్వం మీద పూర్తిగా ఫోకస్ చేస్తాను.
-నేను దర్శకుడుగానే ఎక్కువ ఇష్టపడతాను. మన క్రియేటివిటీ నుంచి వచ్చిన ఒక కథని తెరపై చూడడంలో ఉన్న ఆనందం మరి ఎందులో రాదు. యాక్టింగ్ లో చాలా మంచి పేరు వస్తుంది కానీ పర్సనల్ క్రియేటివ్ సాటిస్ఫేషన్ ఇచ్చేది మాత్రం డైరెక్షనే.

ఈ నగరానికి ఏమైంది రిపీట్ షూటింగ్ ఎలా జరుగుతుంది?
-ఈరోజు కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ సీన్ షూట్ చేశాము. తొలి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా స్కేల్ చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. షూటింగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాము.
మీరు వెంకటేష్ గారితో చేయాలనుకునే సినిమా ఎంతవరకు వచ్చింది?
-దానికి ఇంకా సమయం పడుతుంది. కథపై ఇంకా వర్క్ చేయాలి.
ఎలాంటి కథలు చెప్పాలని అనుకుంటున్నారు ?
-ఒకటే జోనర్ కి ఫిక్స్ అవ్వాలని లేదు. కామెడీ మీద పట్టు వచ్చిందని అనుకుంటున్నాను. గ్యాంగ్ స్టార్, క్రైమ్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ ఇలా చాలా సినిమాలు చేయాలని ఉంది. అలాగే ఒక రొమాంటిక్ కామెడీ కూడా చేయాలనుంది.

