Om Shanti Shanti Shantihi Movie Review: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ రివ్యూ!

రచన- దర్శకత్వం: ఏఆర్ సజీవ్
తారాగణం : తరుణ్ భాస్కర్,ఈషా రెబ్బా,బ్రహ్మాజీ,బ్రహ్మానందం తదితరులు
సంగీతం: జై క్రిష్, ఛాయాగ్రహణం : వై. దీపక్
నిర్మాత : వై. సృజన్
విడుదల : జనవరి 30, 2026

Om Shanti Shanti Shantihi Movie Review: 2022 లో మలయాళంలో బ్లాక్ కామెడీ పేరుతో హిట్టయిన ‘జయ జయ జయ జయ హే’ కుటుంబ కథా చిత్రాన్ని తెలుగులో ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టైటిల్ తో రీమేక్ చేశారు. ఓ టీటీలో స్ట్రీమింగ్ అయి తెలుగు సహా ఇతర భాషల ప్రేక్షకులు చూసేసిన సినిమాని రీమేక్ చేసి ప్రయోజనమేమిటనేది ఎదురయ్యే ప్రశ్న. మలయాళం సినిమాల్ని ఓటీటీల్లో చూసేసే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ. మళ్ళీ రీమేక్ చేస్తే ఎవరు చూస్తారు? దీనికి ఇందులో హీరోగా నటించిన ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇచ్చిన సమాధానం- ‘ఇది రీమేక్ సినిమానే. కానీ ఇందులో గోదావరి ప్రాంత భాష, యాస, అందాాలు అన్నీ చాలా బాగా కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతాన్ని ఇందులో చూపించినంత అందంగా ఎందులోనూ చూపించలేదని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మేము పెట్టిన కృషి ప్రేక్షకులకి నచ్చుతుంది’ అని. కనుక ఈ రీమేక్ ని తెలుగు నేటివిటీకి మార్చి ప్రేక్షకులు ఇంకా బాగా ఎంజాయ్ చేసేలా నిర్మించినట్టు అర్ధం జేసుకుని సినిమా చూడాలి. మరి చూస్తే ఒరిజినల్ ని మరిపించే అచ్చ తెలుగు సినిమాలాగా వుందా? ఇది తెలుసుకుందాం…

కథేమిటి?
ప్రశాంతి అలియాస్ శాంతి (ఈషా రెబ్బా) మధ్యతరగతి యువతి. తల్లిదండ్రులు, సోదరుడు వుంటారు. తల్లిదండ్రులకి ఆమె భవిష్యత్తుపై కన్నా సోదరుడి భవిష్యత్తు మీద ఎక్కువ దృష్టి వుంటుంది. అతడ్ని ఖరీదైన కాలేజీలో మంచి చదువుకి చేర్పించి, శాంతిని సాధారణ కాలేజీకి లో జాయిన్ చేస్తారు. తను ఆడపిల్ల అయినందుకు ఈ వివక్ష అని అర్ధం జేసుకున్న శాంతి తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతుంది. కానీ ప్రయోజనముండదు. ఆటల్లో, చదువులో ఏ విషయంలోనైనా వాళ్ళు చెప్పిన మాటే వినాల్సి వస్తుంది. కాలేజీలో ఒక లెక్చరర్ ఉంటాడు. ఇతను పైకి ప్రగతిశీల, స్త్రీవాద భావాలతో ఉంటాడు గానీ లోలోపల మగ దురహంకారంతో వుంటాడు. ఈ విషయం తెలుసుకోక అతడితో ప్రేమలో పడుతుంది శాంతి. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెని కాలేజీ మాన్పించేసి కోళ్ళ ఫారం యజమాని ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) తో పెళ్లి జరిపించేస్తారు. పెళ్ళయ్యాక ఆమెని చదిస్తానని మాటిస్తాడు ఓంకార్. కానీ ఆ మాట తప్పుతాడు. ఇతడి నిజస్వరూపం కూడా తెలుసుకుంటుంది శాంతి. ఇతను దూకుడుగా, కోపిష్టిగా వుండడం, ఇతరులపై పెద్దగా గౌరవం లేకపోవడం చూసి గొడవకి దిగుతుంది. కోపం పట్టలేక అతను చెంప దెబ్బ కొట్టడంతో ఆమె కరాటే నేర్చుకుని అతడితో అమీ తుమీకి సిద్ధమైపోతుంది. ఇప్పుడు కరాటే నేర్చుకున్న శాంతితో అతనేం చేశాడు, ఇద్దరి మధ్య పోరాటం ఏ సమస్యలకి దారితీసింది, అవి ఎలా పరిష్కరమయ్యాయి అనేది మిగతా కథ.

ఎలావుంది కథ?
మలయాళం రీమేక్ కథని తెలుగు కథగా మార్చేందుకు గోదావరి భాష, యాస వాడుకోవడం మంచి వ్యూహమే. ఒరిజినల్ కథని ఎక్కడా మార్చకుండా ఉన్నదున్నట్టు దించేయడం కూడా నేటివిటీకి అడ్డు కాలేదు. అయితే కథనంలో, సన్నివేశాల చిత్రీకరణలో బలాన్ని పట్టుకోలేక పోయాడు దర్శకుడు. ఇందువల్ల హీరో హీరోయిన్లు ఎంత ఒరిజినాలిటీతో తమవైన నటనల్ని ప్రదర్శించినా కంటెంట్ పరంగా మూవీ యావరేజ్ స్థాయిలో ఉండిపోయింది.

ప్రధానంగా ఈషా రెబ్బా పాత్ర కథ అయిన దీన్ని ఫస్టాఫ్ లో ఆమెని బాధిత పాత్రగా చూపిస్తూ, సెకండాఫ్ రెబెల్ క్యారక్టర్ గా మార్చడం, దీనికి కామెడీని జోడించడం చేయడంతో ఒక్కటి మాత్రం జరిగింది- సెకండాఫ్ ఎక్కడా కథ లేక బోరు కొట్టదు. విడాకులూ, కోర్టులూ, కాన్పులూ, రెబ్బా కోళ్ళఫారం ఓనర్ గా మారిపోవడమూ వంటి మలుపులతో సెకండాఫ్ వినోదాత్మక విలువల్ని నిలబెట్టుకుంటూ కథ సాగడం చాలా మెరుగయ్యింది. దర్శకుడు తన దర్శకత్వానికి ఇంకింత మెరుగులు పెట్టుకుని వుంటే ఈ రీమేక్ మంచి హిట్టు అయ్యేది.

ఎవరెలా చేశారు?
రీమేక్ అంటే కథతో మాత్రమే కాదు, నటనలతో కూడా రిస్కు తీసుకోవాలి. ఒరిజినల్లో నటించిన నటులకి తీసిపోకుండా నటించాల్సి వుంటుంది. ఈ విషయంలో ఒరిజినల్లో నటించిన బేసిల్ జోసెఫ్ కే మాత్రం తీసిపోకుండా కోపిష్టి భర్త పాత్ర నటించాడు తరుణ్ భాస్కర్. అచ్చ తెలుగు గోదావరి వ్యక్తి అన్పిస్తూ ఈ సినిమా రీమేక్ అన్న ఛాయలు పడకుండా తన యాక్టింగ్ టాలెంట్ ని ప్రతీ సన్నివేశంలోనూ ప్రదర్శించాడు. కామెడీని కూడా ఒరిజినల్ తో పోల్చకుండా మరిపిస్తూ నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఒరిజినల్లో హిట్ అయ్యేంత రేంజికి సినిమాని తీసికెళ్ళ లేకపోయాడు. ఎందుకంటే రీమేక్ అనే సరికి మేకింగ్ లో ఉన్న కథా కథనాల డెప్త్ నీ, ఒరిజినాలిటీనీ దర్శకుడు పట్టుకోలేకపోవడం. గోదావరి నేటివిటీ ఓకే, కానీ కంటెంట్ సంగతి?

ఇక ప్రశాంతి పాత్రలో ఈషా రెబ్బా తరుణ్ భాస్కర్ కేమాత్రం తీసిపోని మెచ్యూరిటీతో ఆయా సన్నిశాల్ని రక్తికట్టించింది. అమెది బాధిత పాత్ర, అంతే గాక షేడ్స్ వున్న బాధిత పాత్ర. కుటుంబ పాత్ర. ఇంకా చెప్పుకుంటే యాక్షన్ పాత్ర కూడా ఈ వేరియేషన్స్ ని అర్ధం జేసుకుని పాత్ర పోషణ చేసింది. తరుణ్ తో కరాటే యాక్షన్ సీన్స్ లో చెలరేగిపోయింది మాస్ కమర్షియల్ అప్పీల్ కూడా వున్న ఈ పాత్రతో.
తరుణ్ మామగా బ్రహ్మాజీ ఎప్పుడు కన్పించినా నవ్వించే పాత్ర. కామెడీలో బ్రహ్మాజీ అందెవేసిన చేయి అని తెలిసిందే. తన ఈ పవర్ ని బాగా వినియోగించుకున్నాడు. మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు బాగా నటించారు.

సాంకేతికాల సంగతి?
ఇది తెలుగు ఒరిజినల్ అన్న తాపత్రయాన్ని సంగీత దర్శకుడు కూడా ప్రదర్శించాడు. పాటలతో, బీజీఎంతో ఒక మ్యూజికల్ కామెడీగా నిలబెట్టేందుకు కృషి చేశాడు జై క్రిష్. ఇక వై. దీపక్ తన ఛాయాగ్రహణంతో గోదావరి అందాల్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గోదావరి అందాల్ని ఇదివరకే చాలా సినిమాలు చూపించేసిన పోటీ తనకుంది. డిఫరెంట్ గా ఏం చేయాలన్నది ఇంకా బాగా ఆలోచించాల్సింది. పొతే ప్రొడక్షన్ విలువలు మంచి ప్రమాణాలతో వున్నాయి.

చివరికేమిటి?
రీమేక్ చేస్తే హిట్టయిన సినిమాలెన్నో వున్నాయి. కాకపోతే ఓటీటీలో అందరూ చూసేసే వీలున్న సినిమాల్ని రీమేక్ చేసే సాహసం చేయడం లేదు. అయితే ఓటీటీల్లో చూసేది ఎంత మంది? మిడిల్ క్లాస్, మాస్ ప్రేక్షకులు మిగిలే వుంటారు. కనుక రీమేకులు రిస్కీ బిజినెస్ కాక పోవచ్చు. ప్రస్తుత రీమేక్ కూడా రిస్కు అన్పించదు. కాకపోతే ఒరినల్ అంత హిట్ అవకపోవచ్చు (5-6 కోట్ల బడ్జెట్ కి 43-50 కోట్ల బాక్సాఫీసు), ఫ్లాప్ మాత్రం కాదు. టిమ్ అలెన్ నటించిన ‘జో సమ్ బడీ’ అని హాలీవుడ్ హిట్ వుంది. అందులో అమాయకుడైన హీరో, పార్కింగ్ లాట్ లో కూతురి ముందు తనని బలవంతుడు కొట్టాడని, అదే బలవంతుడ్ని బహిరంగంగా తిరిగి కూతురి ముందే కొట్టాలని- కరాటే గిరాటే గట్రా నేర్చుకునే కథ తిరిగే మలుపులు ఎలాగో, భర్త చేత చెంపదిబ్బ తిన్న ఈషా రెబ్బా కథ కూడా ఇలాటిదే- కరాటే రాణిగా మారి మొగుడికి ఛాలెంజీ విసిరే కామెడీలతో. సంక్రాంతికి విడుదలైన ఒకే రకమైన రొటీన్ కథలతో మూస కామెడీ సినిమాల కంటే ఇది బెటరే.

రేటింగ్ : 2.5/5

Journalist Bharadwaj  EXPOSED Vijayasai Reddy Joining in BJP | YS JAGAN | Telugu Rajyam