Funky : ‘ఫంకీ’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ విడుదల

Funky : వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్‌ కథానాయిక.

ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగు పెట్టనున్న ‘ఫంకీ’ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, మొదటి గీతం ‘ధీరే ధీరే’కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతంగా ‘రట్టాటటావ్’ విడుదలైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఆర్కే సినీప్లెక్స్ లో ఈ గీతావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

మెలోడీ పాట ‘ధీరే ధీరే’తో శ్రోతల మనసు దోచుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, ఇప్పుడు ‘రట్టాటటావ్’ రూపంలో ఉత్సాహభరితమైన గీతాన్ని అందించారు. మాస్ బీట్స్ తో ఆయన స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఆ ఉత్సాహభరితమైన సంగీతానికి తగ్గట్టుగానే “రట్టాటటావ్ పిల్ల రట్టాటటావ్.. నీకు దండం ఎట్టుకుంట పిల్ల రట్టాటటావ్” అంటూ దేవ్ పవార్ అందించిన సాహిత్యం అందరికీ చేరువ అయ్యేలా ఎంతో అందంగా, సరదాగా ఉంది. గాయకుడు రామ్ మిరియాల తన గాత్రంతో ఈ పాటకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.

దృశ్య పరంగా కూడా ఈ పాట ప్రత్యేకంగా నిలుస్తోంది. విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఈ జోడీ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ప్రధాన తారాగణం తెరపై కనిపించిన తీరు, హరివిల్లుని తలపించే రంగురంగుల దృశ్యాలు, ఆకట్టుకునే నృత్య రీతులు కలిసి ఈ పాటను నేటి యువతకు నచ్చేలా మరింత ఆకర్షణీయంగా మార్చాయి. సంగీతం నుంచి దృశ్యాల వరకూ ప్రతి అంశం సమపాళ్లలో కుదిరి ‘రట్టాటటావ్’ను అద్భుత గీతంగా మలిచాయి.

భీమ్స్ సిసిరోలియో సంగీతానికి శ్రోతలలో ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, తొలి గీతం ‘ధీరే ధీరే’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రెండో గీతం ‘రట్టాటటావ్’ కూడా అదే జోరును కొనసాగించడంతో.. ‘ఫంకీ’ చిత్రం సంగీత ప్రియులకు మరిచిపోలేని విందును అందించనుందని స్పష్టమైంది.

గీతావిష్కరణ కార్యక్రమంలో కథానాయకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. నా మొదటి సినిమా నుంచే ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్‌, హిట్ ఇలా మంచి సినిమా చేసిన ప్రతిసారీ నన్ను సపోర్ట్ చేశారు. నా గత చిత్రాలు ఒకట్రెండు మిమ్మల్ని పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయి. మీ అందరి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాను. ‘ఫంకీ’ సినిమాతో మళ్ళీ ఒకటి నుంచి మొదలుపెడుతున్నాను. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనుదీప్ ప్రత్యేకమైన వ్యక్తి. తనతో పని చేసిన తర్వాత నేను సినిమాని, జీవితాన్ని చూసే కోణం మారిపోయింది. అనుదీప్ రచన, హాస్యం భిన్నంగా ఉంటుంది. ఫంకీ మీ అందరికీ మంచి అనుభూతిని ఇస్తుంది. ఫిబ్రవరి 13న థియేటర్లకు వచ్చి ఈ సినిమాను ఆదరించండి.” అన్నారు.

కథానాయిక కయాదు లోహర్‌ మాట్లాడుతూ.. “రట్టాటటావ్ పాటకు మీ నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తోంది. ఇది నా అభిమాన గీతాల్లో ఒకటిగా మారిపోయింది. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటుంది. ఆద్యంతం నవ్విస్తుంది. ఇంత మంచి సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. అందరం ఎంతో కష్టపడి పని చేశాం. ఈ చిత్రాన్ని మీ అందరికీ చూపించడం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము.” అన్నారు.

దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ..”ఈ పాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీ కుటుంబంతో కలిసి ఫంకీ సినిమాని సంతోషంగా చూడొచ్చు. ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వులు పంచుతుంది. ఫిబ్రవరి 13న విడుదలవుతున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.” అన్నారు.

దర్శకుడు కె.వి. అనుదీప్ తన శైలి కామెడీ విందుతో తిరిగి వచ్చారు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని, థియేటర్లలో నవ్వుల వర్షం ఖాయమన్న సంకేతాలను ఇచ్చింది.

విభిన్న పాత్రలు, విశ్వక్ సేన్-కయాదు లోహార్ సరికొత్త జోడి, ఉత్సాహభరితమైన సంగీతం, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి పేరుగాంచిన దర్శకుడు.. ఈ అన్ని అంశాలు తోడై ‘ఫంకీ’ చిత్రం వెండితెరపై అపరిమిత వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెడుతున్న ‘ఫంకీ’ చిత్రం, ప్రేక్షకులకు వినోదాల విందుని అందించనుంది.

చిత్రం: ఫంకీ

తారాగణం: విశ్వక్ సేన్, కయాదు లోహర్‌, నరేష్, వీటీవీ గణేష్ తదితరులు

దర్శకత్వం: అనుదీప్ కె.వి.
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
రచన: అనుదీప్ కె.వి, మోహన్
కళా దర్శకుడు: జానీ షేక్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Advocate Azad Shocking Commnets on MLA Arava Sridhar | Telugu Rajyam