భారతీయ రైల్వే.. భారత ప్రజల ఆస్తి.. దాన్ని పూర్తిగా ప్రైవేటీకరించే (అమ్మేసే) ప్రసక్తే లేదని కేంద్రం చెబుతోంది. మరి, విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా దేశ ప్రజల ఆస్తే కదా.? దాన్నెందుకు అమ్మేస్తున్నట్లు.? ఈ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద సమాధానం దొరకదుగాక దొరకదు.
పోనీ, భారతీయ రైల్వేని మోడీ సర్కార్ ప్రైవేటీకరించకుండా వుంటుందా.? ఇప్పుడు చెబుతున్న ఈ మాట, వచ్చే ఏడాది వరకూ ఇలాగే వుంటుందా.? అంటే, చెప్పలేం. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌కి డబ్బులు కావాలి. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న సత్సంకల్పం వుండి వుంటే, ఆ అభివృద్ధి ఫలాలతో దేశం మరింతగా అభివృద్ధి పథాన నడిచేది. అధికారంలోకి వచ్చినప్పటినుంచీ పబ్లిసిటీ స్టంట్లే. పెద్ద నోట్ల రద్దు.. దేశానికి అతి పెద్ద శాపంగా మారింది. అక్కడి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతూ వచ్చింది. జీఎస్‌టీ పేరుతోనూ గందరగోళమే సృష్టించింది మోడీ సర్కార్.
జీఎస్‌టీ తెచ్చిన కష్టాల ఊబి నుంచి రాష్ట్రాలు బయటపడలేని దుస్థితి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కరోనా వచ్చినపడింది. దాంతో, దేశం మరింతగా విలవిల్లాడిపోతోంది. చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో దేశంలో ధరల మోత మోగుతోంది. పెట్రో ఉత్పత్తుల మీద పన్నుల వడ్డనతో ప్రజల నడ్డి విరుస్తోంది మోడీ సర్కార్. మరి, ఈ డబ్బులన్నీ ఏమయిపోతున్నాయి.? ఏమో, ఎవరికీ తెలియదు. దేశంలో కొందరి ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ అతి కొద్ది మంది మాత్రమే బీజేపీ పాలనతో లాభం పొందుతున్నారు. వారికే, ప్రభుత్వ రంగ సంస్థలూ అప్పనంగా దక్కుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. రైల్వేలో ప్రైవేటు పెత్తనం నానాటికీ పెరిగిపోతోంది. ప్రైవేటు రైళ్ళు పట్టాలెక్కుతున్నాయ్.. అంటే, సమీప భవిష్యత్తులో భారతీయ రైల్వే కూడా ఈ ప్రైవేటు దెబ్బకి విలవిల్లడబోతోందన్నమాట. ‘అమ్మేస్తాం, కుదరకపోతే మూసేస్తాం..’ అని ఉక్కు పరిశ్రమ విషయంలో వ్యాఖ్యనించిన కేంద్రం, ముందు ముందు అదే మాటని భారతీయ రైల్వే విషయంలోనూ అనబోదని ఎలా నమ్మగలం.?