రఘురామ జుగుప్సాకర రాజకీయం.. ఇదిగో నిదర్శనం..

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, రాజద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ వ్యవహారానికి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. టీడీపీతో కలిసే ఆయన కుట్ర పన్నారన్నది అధికార వైసీపీ ఆరోపణ. ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.. రఘురామ ఫోన్ డేటాలోని అంశాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసం వేసిన పిటిషన్ల దగ్గర నుంచి, వివిధ కేసుల్లో న్యాయస్థానాల్లో జరుగుతున్న విచారణలపై టీడీపీ నేతలతో రఘురామ చర్చలు, విశ్లేషణల వ్యవహారాలు, న్యూస్ ఛానళ్ళతో ఆయన సంప్రదింపులు జరిపి, తన రచ్చబండకు పాపులారిటీ పెంచుకుంటోన్న వైనం.. ఇవే కాక, ఆయా సంస్థల నుంచి అందుకుంటోన్న పారితోషికాలు.. ఇలాంటి విషయాలు ఒక్కోటీ బయటపడుతున్నాయి.

ప్రియతమ ముఖ్యమంత్రి.. అంటూనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విద్వేషం కక్కుతున్నారు రఘురామ. న్యాయ వ్యవస్థలోని ముఖ్యమైన వ్యక్తులు.. అదేనండీ, న్యాయమూర్తుల మీద కూడా రఘురామ సెటైర్లు వేసినట్లు.. తాజాగా వైసీపీ అనుకూల మీడియాలో కథనాలొచ్చాయి. రఘురామ ఫోన్ డేటా పరిశీలిస్తే, అందులోని అంశాలు అత్యంత జుగుప్సాకరంగా వున్నాయన్నది ఆ కథనాల సారాంశం. వీటిని న్యాయస్థానాలకు విచారణ సంస్థ ఏపీ సీఐడీ యదాతథంగా నివేదించడం గమనార్హం. న్యాయ వ్యవస్థ గురించి రఘురామ చాలా చాలా గొప్పలు చెబుతూ వచ్చారు రచ్చబండ కార్యక్రమంలో. చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి డేష్ డాష్.. అన్నట్టుగా, న్యాయమూర్తులకు ప్రాంతాన్ని అంటగట్టి, కులాన్ని అంటగట్టి గేలి చేయడమేంటి.? అది కూడా, వైసీపీ రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ నేతలతో. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారట. మరి, వీటిపై రఘురామ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.