ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసింది. గుంటూరులో ఈ రోజు పెట్రోల్ ధర 100 దాటేయడంతో, తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఈ మార్క్ అందుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డులకెక్కింది. తెలంగాణతో పోల్చిత పెట్రో ఉత్పత్తులపై ఆంధ్రపదేశ్‌లో అదనపు పన్నులు వసూలు చేస్తున్న విషయం విదితమే. పొరుగు రాష్ట్రాలన్నిటిలోనూ ఏపీతో పోల్చితే తక్కువ ధరలే వుంటున్నాయి పెట్రోల్, డీజిల్ విషయానికొస్తే. చంద్రబాబు హయాంలోనే ఈ పరిస్థితి నెలకొంది. అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు బాదిన బాదుడు, అమరావతి ప్రాజెక్టు ఆగిపోయినా కొనసాగుతుండడం గమనార్హం. నిజానికి, లాక్ డౌన్ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ విషయంలో డిమాండ్ కొంత తక్కువగానే వుంది. అయినా, దేశవ్యాప్తంగా పెట్రోధరలు ఎందుకు పెరుగుతున్నాయి.? చమురు సంస్థలు అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్నాయి. దానికి తోడు కేంద్రమూ, ఆదాయం కోసం పెట్రో కంపెనీల దాష్టీకాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. కేంద్రం, రాష్ట్రాలు.. కలిసి కట్టుగా పెట్రో ఉత్పత్తులపై బీభత్సమైన రీతిలో పన్నుల్ని దంచేస్తుండడం గమనార్హం. నిజానికి, పెట్రోలు అలాగే డీజిల్ మీద పన్నుల వాటా 50 శాతం పైగానే వుందంటూ పలు సందర్భాల్లో గణాంకాలు కూడా వెలుగు చూశాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమంటే.. ఆ ప్రభావం అన్ని రంగాలపైనా వుంటుంది.. కూరగాయల దగ్గర్నుంచి, అన్ని ధరలపైనా పెట్రో మంట ప్రభావం వుంటుంది. అయినా, పెట్రోలు – డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలోకి కేంద్రం తీసుకురావడంలేదు. రాష్ట్రాలూ ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలేదు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే, డబ్బులు కావాలి. అలా ఖజానా నింపుకోవడానికి పెట్రో ఉత్పత్తులు అలాగే మద్యం.. ప్రభుత్వాలకి ప్రధాన ఆదాయవనరుగా మారుతున్నాయి. కరోనా హంగామా నేపథ్యంలో పెట్రో మంటని జనం పట్టించుకోవడంలేదా.? అంటే, అవునని చెప్పక తప్పదు.