పెట్రోల్, డీజిల్.. జీఎస్టీ పరిధిలోకి.. జనాన్ని బాగుపడనిస్తారా.?

జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటినుంచీ జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌లను తీసుకొచ్చేస్తారంటూ ప్రచారం జరుగుతూనే వుంది. జీఎస్టీ కౌన్సిల్ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. ఆ కౌన్సిల్‌లో రాష్ట్రాలుంటాయి.. రాష్ట్రాల నిర్ణయాలకు అనుగుణంగా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. ఇదో నెపం మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఇదొక కుంటి సాకు కేంద్రానికి. పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి దాదాపుగా ఏ రాష్ట్రమూ ఒప్పుకోదు. ఎందుకంటే, రాష్ట్రాలు తమకు నచ్చిన రీతిలో పెట్రోల్, డీజిల్‌లపై పన్నులు వేసేసుకుంటున్నాయి. సందట్లో సడేమియా కేంద్రం కూడా పెట్రోల్, డీజిల్‌లపై పన్నుల బాదుడుతో పండగ చేసుకుంటోంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు.. ప్రజల్ని నిలువుగా దోపిడీ చేసేస్తున్నాయి పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో.

అటు కేంద్రం తగ్గించదు.. ఇటు రాష్ట్రాలూ తగ్గించవు. తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటారు. నిజానికి, పెట్రో ధరలు తగ్గితే.. చాలా ధరలు తగ్గిపోతాయ్. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం అన్ని రకాల వస్తువల ధరలపైనా వుంటుంది.. దాదాపు అన్ని రకాల సేవలపైనా ఆ ప్రభావం వుంటుంది. అందుకే, పెట్రోల్ అలాగే డీజిల్ ధరల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసపాటి మానవత్వం వుండి తీరాలి. దురదృష్టవశాత్తూ అది కేంద్రంలో వున్న ప్రభుత్వానికిగానీ, రాష్ట్రంలో వున్న ప్రభుత్వాలకిగానీ లేదాయె. లేకపోతే, పెట్రోల్ ధర సెంచరీ దాటేయడమేంటి.? అంతర్జాతీయ స్థాయిలో మడి చమురు ధరల పెరుగుదల అనేది ఓ కుంటి సాకు మాత్రమే. దేశీయ చమురు కంపెనీలు మింగేస్తున్నాయా.? ప్రభుత్వాలు బొక్కేస్తున్నాయా.? ఏమోగానీ, సామాన్యుడి జేబుకు మాత్రం చిల్లు పడుతోంది. పడుతూనే వుంటుంది. అదే పెట్రోల్ అలాగే డీజిల్‌ని గనుక జీఎస్టీలోకి తీసుకొస్తే.. ఈ స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాన్ని దోచుకోవడానికి కుదరకపోవచ్చు. అందుకే అదెప్పటికీ జరగదు.. సామాన్యుడికి ఊరట దొరకదు.