పాత ఎజెండాతోనే మ‌ళ్లీ ఢిల్లీలో లొల్లి!

కృష్ణా-గోదావ‌రి నదీ జ‌లాల‌కు సంబంధించి రెండు తెలుగు రాష్ర్టాల మ‌ధ్య ద‌శాబ్ధాలుగా వాటాల విష‌యంలో ఆధిప‌త్య‌పోరు కొన‌సాగుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ర్టాలు ఉమ్మ‌డిగా ఉన్న రోజుల్లో కూడా ఆంధ్ర‌ప్రాంత ప్రాజెక్ట్ ల‌కు నీటి కేటాయింపుల్లోనూ, తెలంగాణ ప్రాంత జ‌లాశ‌యాల‌కు జ‌లాల త‌ర‌లింపులోనూ ప్రాంతాల మ‌ధ్య విబేధాలు నెల‌కోంటూనే ఉన్నాయి. అనేక సంద‌ర్భాల్లో కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ రెండు ప్రాంతాల‌ను సమ‌న్వ‌య ప‌రిచేందుకు స‌మావేశాలు నిర్వ‌హించినా ఒకటి రెండు సంద‌ర్భాల్లో మిన‌హా అనేక సంద‌ర్భాల్లో స‌త్ఫ‌లితాలివ్వ‌లేదు. రాష్ర్ట విభ‌జ‌న త‌రువాత రెండు తెలుగు రాష్ర్టాలుఉ విడిపోయిన త‌ర్వాత కూడా కీల‌క‌మైన స‌మావేశం జ‌రిగిన‌ప్ప‌టికీ అవి ఎజెండాకే ప‌రిమిత‌మ‌య్యాయి త‌ప్ప ప‌రిష్కారానికి నోచుకోలేదు.

తాజాగా అంధ్ర‌, తెలంగాణ మ‌ధ్య కొత్త ప్రాజెక్ట్ ల నిర్మాణానికి సంబంధించి వివాదం తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఒక‌రాష్ర్టంపై మ‌రొక రాష్ర్టం కృష్ణా, గోదావ‌రి న‌ది బోర్డుల‌కు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు కేంద్రం మ‌రోసారి జోక్యం చేసుకుంది. తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు కౌన్నిల్ స‌భ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించాల‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి నిర్ణ‌యం తీసుకుని ఆదిశ‌గా రెండు రాష్ర్టాల‌కు స‌మాచారం పంపారు. దీంతో రెండు రాష్ర్టాల మ‌ధ్య న‌లుగుతోన్న జ‌ల‌వివాదం, కొత్త ప్రాజెక్ట్ ల అంశం కూడా మ‌రోసారి కేంద్రం దృష్టి సారించిన‌ట్లు అయింది.

కీల‌క‌మైన ఈ స‌మావేశాన్ని ఈనెల 26 త‌ర్వాత నిర్వ‌హించాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. అయితే కేంద్రం జోక్యంతో ఈ వివాదం స‌ద్దుమ‌ణుగుతుందా?  రెండు రాష్ర్టాల మ‌ధ్య కొత్త ప్రాజెక్ట్ ల నిర్మాణ స‌మ‌స్య‌కు పరిష్కారం దొరుకుతుందా? అంటే మ‌ళ్లీ పాత క‌థే పున‌రావృతం అవుతుంద‌ని ఆరంగానికి సంబంధించిన నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దానికి బ‌ల‌మైన కార‌ణాలు కూడా విశ్లేషిస్తున్నారు. గ‌తంలో ఇదే అంశంపై వివాదం జ‌రిగిన‌ప్పుడు ఆ స‌మ‌స్య‌కు ఎలాంటి ప‌రిష్కారం దొర‌క‌లేద‌ని గుర్తుచేసారు. మ‌ళ్లీ మూడున్న‌ర సంవ‌త్స‌రాల త‌ర్వాత అదే స‌మ‌స్య‌పై చ‌ర్చించ‌డానికి గ‌త ఎజెండాతోనే అపెక్స్ క‌మిటీ స‌మావేశానికి సిద్ద‌మ‌వుతుంది. మ‌రి ఇందులో ఎలాంటి పురోగ‌తి ఉంటుందో చూడాలి.  అప్ప‌టి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి రెండు రాష్ర్టాలు ఏర్పాటైతే నీళ కోసం కొట్టుకుంటార‌ని నాడే హెచ్చ‌రించార‌ని, కానీ అప్పుడు ఆయ‌న మాట‌ను కేంద్రం ప‌ట్టించుకోలేద‌ని గుర్తు చేసారు.