నిర్మలమ్మ నీతి: అవసరం వున్నా, లేకున్నా అమ్మేస్తాం.!

Nirmala Sitharaman

nirmala sitharaman privatisation modi

ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేయాలన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు పలువురు కేంద్ర మంత్రులు స్పష్టం చేసేశారు. ‘ప్రభుత్వం వ్యాపారం చేయదు’ అని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఓ సందర్భంలో కుండబద్దలుగొట్టేశాక.. దేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు.. అనేవి ఏమన్నా మిగులుతాయా.? అన్న అనుమానాలు అక్కర్లేదు. ఏవీ మిగలవు భవిష్యత్తులో కేంద్ర ప్రబుత్వ రంగ సంస్థలనేవి. అది నవరత్న హోదా కలిగిన సంస్థలైనా, మరొకటైనా. ఇంతకీ, ఈ అమ్మకాలు ఎందుకు జరుగుతున్నాయి.? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్‌గా చెప్పేశారు మన తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే నిధులను సామాజిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం వెచ్చించాల్సి వుందట. అద్గదీ అసలు సంగతి. అభివృద్ధి చేతకానప్పుడు అప్పులు పెరిగిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో చేసేది లేక, వున్న ఆస్తుల్ని అమ్మేసుకోవాలన్నమాట. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే, అమ్మకుంటూ పోతే.. రేప్పొద్దున్న అవసరానికి అప్పూ పుట్టదు.. అమ్ముకుందామంటే ఏదీ మిగలదన్న విషయాన్ని పాలకులు ఎందుకు విస్మరిస్తున్నట్లు.? చివరాఖరికి దేశాన్ని అమ్మేయడానికి కూడా పాలకులు వెనుకడుగు వేయరేమోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ ఉక్కు విషయమై ప్రస్తుతం పోరాటం జరుగుతోంది. కానీ, ఈ పోరాటం దేశవ్యాప్తంగా జరగాలి. కొత్త వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లోనే ఎందుకు ఉద్యమం నడుస్తోంది.? వివిధ రాష్ట్రాల్లో ఎందుకు జనం స్పందించడంలేదు.? అంటే, అదంతే.. విభజించు – పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతం ఇక్కడ బాగానే అప్లయ్ అవుతోంది మరి.