స్క్రిప్ట్ విషయంలో సీరియస్ .. ఆ వార్తలకు చెక్ పెట్టిన నిఖిల్?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాలో కీలక పాత్రలో నటించిన నిఖిల్ ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు కొన్నాడు. ఆ తర్వాత యువత సినిమాతో హీరోగా మారి స్వామి రారా, కార్తికేయ వంటి మంచి హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ కార్తీకేయ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 12 న విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తికేయ సినిమా మంచి హిట్ అవటంతో కార్తీకేయ 2 సినిమా మీద కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో నిఖిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో కార్తీకేయ 2 సినిమా విడుదల తేది కోసం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో వెల్లడించాడు. ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్దలు తన సినిమా రిలీస్ కాకుండా అడ్డుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో జీవితంలో మొదటిసారిగా ఏడ్చానని నిఖిల్ వెల్లడించాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా తన గురించి వస్తున్న వార్తల గురించి కూడా నిఖిల్ స్పందించాడు.

చాలా రోజులుగా నిఖిల్ గురించి ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. సినిమా స్టొరీ ఓకే చేసి సెట్స్ మీదకు వెళ్ళిన తర్వత నిఖిల్ కథలో వేలు దూర్చి స్క్రిప్టు మారుస్తాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ఈ వార్తలపై స్పందించాడు. కథ ఒకే చేసిన తర్వాత స్క్రిప్టు మారిస్తే నాకు అసలు నచ్చదు. స్క్రిప్ట్‌ని ఫైనల్ అయ్యి సెట్స్ మీదకి తీసుకెళ్లిన తర్వాత కొందరు మళ్లీ మార్పులు చేస్తారు. అలా చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. అలా ఎందుకు మార్చారు? అని ప్రశ్నిస్తే స్క్రిప్టు విషయంలో కలుగచేసుకుంటానని నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు అంటూ నిఖిల్ తన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.