రాత్రంతా కళ్లుమూసుకున్నా నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నారా.. కడుపు బరువుగా, ఉబ్బినట్టుగా అనిపిస్తూ అసౌకర్యం వేధిస్తోందా.. చాలామంది దీన్ని సాధారణ నిద్రలేమి సమస్యగా భావించి వదిలేస్తుంటారు. కానీ వైద్య నిపుణులు చెబుతున్న మాట మాత్రం వేరేలా ఉంది. ఈ సమస్యకు మూలకారణం చాలా సందర్భాల్లో మనం పెద్దగా పట్టించుకోని ‘మలబద్ధకం’ కావచ్చని హెచ్చరిస్తున్నారు. మలబద్ధకం అనేది కేవలం ఉదయం బాత్రూమ్‌లో ఎదురయ్యే ఇబ్బందిగా మాత్రమే కాదు. పేగులు సరిగా పనిచేయకపోతే, అది నేరుగా మన నిద్రపై ప్రభావం చూపిస్తుంది. కడుపులో గ్యాస్ పేరుకుపోవడం, ఉబ్బరం, లోపలి ఒత్తిడి వంటివి రాత్రిపూట శరీరాన్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. దీంతో లోతైన నిద్ర దూరమై, తరచూ మేల్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇందుకు ప్రధాన కారణం మన పేగులు–మెదడు మధ్య ఉండే బలమైన అనుసంధానం. పేగుల ఆరోగ్యం దెబ్బతింటే, నిద్రను నియంత్రించే సెరోటోనిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. అదే సమయంలో జీర్ణక్రియ మందగించడం వల్ల కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరిగి, తెలియని ఆందోళన, అసహనం రాత్రిపూట వెంటాడుతుంది. ఫలితంగా మనసు అలర్ట్‌గా ఉండిపోయి నిద్రకు అడ్డంకి అవుతుంది. ఇదంతా ఒక్కరోజులో వచ్చే సమస్య కాదు. సరిగ్గా తినకపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం, నీరు తక్కువగా తాగడం, రోజంతా కదలికలు లేకుండా కూర్చోవడం వంటివి కలిసి ఈ సమస్యను మెల్లగా పెంచుతాయి. పైగా నిద్ర వేళలు, భోజన వేళలు అస్తవ్యస్తంగా ఉంటే శరీరంలోని బాడీ క్లాక్ దెబ్బతిని, పేగులకు అందాల్సిన సహజ సంకేతాలు కూడా గందరగోళం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా జీవనశైలిలో చిన్న కానీ కీలకమైన మార్పులు చేసుకోవాలి. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, ఓట్స్, బీన్స్ వంటి వాటిని మెల్లగా చేర్చుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ ఫైబర్ తీసుకుంటే గ్యాస్ సమస్య పెరగొచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం. అలాగే ఫైబర్ సరిగ్గా పనిచేయాలంటే రోజంతా శరీరానికి సరిపడా నీరు అందడం చాలా ముఖ్యం.
క్రమశిక్షణ కూడా పేగుల ఆరోగ్యానికి కీలకం. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకుంటే శరీరం తన సహజ రిథమ్‌లోకి వస్తుంది. ఉదయం హడావిడిగా కాకుండా, ప్రశాంతంగా బాత్రూమ్‌కు వెళ్లే అలవాటు చేసుకోవాలి. రాత్రి భోజనం పడుకునే కనీసం మూడు గంటల ముందే ముగిస్తే జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. దీనికి తోడు రోజూ కొద్దిసేపు నడక, తేలికపాటి వ్యాయామం, ధ్యానం చేస్తే పేగులు, మనసు రెండూ రిలాక్స్ అవుతాయి. అయితే ఈ మార్పులు చేసినా సమస్య తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకూడదు. వారాల తరబడి మలబద్ధకం కొనసాగడం, తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, మలంలో రక్తం కనిపించడం లేదా కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ప్రశాంతమైన నిద్రకు మొదటి అడుగు ఆరోగ్యమైన పొట్టేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
