రచన –దర్శకత్వం : మురళీ మనోహర్
తారాగణం : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగిబాబు, జీవన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్, జాన్ విజయ్ తదితరులు
సంగీతం : కృష్ణ సౌరభ్ సూరంపల్లి, చాయాగ్రహణం : అర్జున్ రాజా, కూర్పు : కార్తీక్ శ్రీనివాస్ నిర్మాతలు : వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్
విడుదల : డిసెంబర్ 19, 2025
Gurram Papireddy Movie Review: వర్ధమాన హీరో నరేష్ అగస్త్య నటించిన డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘గుర్రం పాపిరెడ్డి’ ఈవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. బ్రహ్మానందం, యోగిబాబులు కామెడీ పాత్రలు నటించారు. ఇంకా మరికొందరు కమెడియన్లతో దర్శకుడు మురళీ మోహన్ చేసిన ఈ డార్క్ థ్రిల్లర్ ప్రయత్నం ఎంతవరకు మెప్పిస్తుందో ఈ క్రింద చూద్దాం…
కథేమిటి?
ఖమ్మం జిల్లాకి చెందిన గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య), ఉడ్రాజు(యోగిబాబు) కలిసి బ్యాంకు దోపిడీకి ప్లానేస్తాడు. పాత ఫ్రెండ్స్ మిలటరీ(కసిరెడ్డి), చిలిపి(వంశీధర్ గౌడ్)లతోపాటు గొయ్యి(జీవన్)లని ఈ ప్లాన్లో కలుపుకుంటాడు. ఈ దోపిడీ ప్లాను బెడిసి కొట్టి పోలీసులకి దొరికిపోతాడు. నగలూ వజ్రాలూ తీసుకుని ఉడ్రాజు పారిపోతాడు. జైలునుంచి పాపిరెడ్డి బయటికొచ్చి పిచ్చాసుపత్రిలో నర్సు సౌదామిని(ఫరియా అబ్దుల్లా)తో కలిసి ఇంకో ప్లానేస్తాడు. ఈ ప్లాను ప్రకారం శ్రీశైలం శ్మశానంలో ఖననం చేసిన ఒక శవాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ శ్మశానవాటిలో, కళింగ పోతురాజు సమాధిలో పూడ్చే పనిని పాత ఫ్రెండ్స్ కే అప్పజెప్తాడు. ఈ పని పూర్తయ్యాక కళింగ వంశీయుల ఆస్తులపై కేసు వేస్తాడు. పాత ఫ్రెండ్ గొయ్యినే కళింగ పోతురాజు మనవడు అని క్లెయిం చేస్తూ ఉత్తరం రాస్తాడు. ఇది పెద్ద కేసవుతుంది. ఇప్పుడు శ్మశాన వాటికల్లో గొయ్యిలు తీసే గొయ్యికి, కళింగ వంశీయులకీ వున్న సంబంధం ఏమిటి? ఈ కేసు పెట్టిన గుర్రం పాపిరెడ్డి అసలు ప్లానేంటి? ఇందులో ఈ పాత ఫ్రెండ్స్ మిలటరీ, చిలిపి, గొయ్యి తో బాటు సౌదామిని ఎలా తోడ్పడ్డారు? ఇదీ మిగతా ఈ డార్క్ కామెడీ కథ!
ఎలా వుంది కథ?
2023 లో తరుణ్ భాస్కర్ నటించి దర్శకత్వం వహించిన ‘కీడా కోలా’ అనే డార్క్ కామెడీ థ్రిల్లర్ సక్సెస్ అయింది. ఇదే కోవలో ఇప్పుడు దర్శకుడు మురళీ మోహన్ ‘గుర్రం పాపిరెడ్డి’ తో డార్క్ కామెడీ తీసే ప్రయత్నం చేశాడు. అయితే ఇందులో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ఎంచుకున్న కథ వరకూ కొత్తగా బాగానే వుంది గానీ, దానికి అల్లిన కామెడీ సీన్లు అంతగా వర్కౌట్ కాక, బారెడు సాగుతూ సహన పరీక్ష పెట్టే విధంగా వున్నాయి.
కథా ప్రారంభంలో జడిజి పాత్రలో బ్రహ్మానందం స్టుపిడిటీ గురించి వివరిస్తాడు. ఈ స్టుపిడిటీతో క్యారక్టర్లు నవ్విస్తూ ఎలాంటి పనులు చేశారనేది బేస్ గా చేసుకుని ఈ కథ నడిపాడు దర్శకుడు. అయితే ఫస్టాఫ్ లో శ్రీశైలం నుంచి శవాన్ని తెచ్చి హైదరాబాద్ లో పాతి పెట్టే సీక్వెన్సులో కామెడీ మాత్రమే వర్కౌట్ అయింది. ప్రారంభంలో బ్యాంకు దోపిడీ గానీ, శవంతో సీక్వెన్స్ తర్వాతగానీ డార్క్ కామెడీ పేరుతో చేసిన కామెడీ లౌడ్ గా ఉంటూ సహన పరీక్ష పెడుతుంది. ఇంటర్వెల్ సీనులో వచ్చే మలుపు మాత్రమే శవంతో సీక్వెన్స్ తర్వాత బలంగా, ఆసక్తి పెంచే విధంగా వుంది.

ఇక సెకండాఫ్ లో కళింగ రాజవంశస్థులపై కేసు వేయడం, ఈ కేసు గెలవడానికి సాక్ష్యాల విషయంలో చేసే కామెడీ కొన్ని చోట్ల బావుంది. అయితే సెకండాఫ్ అధిక భాగం కోర్టులోనే సాగడంతో ఈ డార్క్ థ్రిల్లర్ లో యాక్షన్ కొరవడింది. ఒక దశ తర్వాత కోర్టు కామెడీ కూడా పని చేయలేదు. కేసు గెలవడానికి గుర్రంపాపిరెడ్డి బ్యాచి చేసే క్రేజీ పనులు మరీ సిల్లీగా వుంటాయి.
అయితే అసలు హీరో లక్ష్యం ఏమిటో, దేనికోసం ఇదంతా చేస్తున్నాడో స్పష్టం చేయకపోవడం వల్ల కథ ఎటు పోతోందో అర్ధంగాదు. క్లయిమాక్స్ లో తన లక్ష్యం చెప్పినప్పుడు మాత్రమే కథ అర్ధమవుతుంది. ఇలా ముగింపు వరకూ లక్ష్యాన్ని దాచి పెట్టడం వల్ల కథా కథనాలు కనెక్ట్ కాకుండా వుండి పోయాయి.
ఎవరెలా చేశారు?
గుర్రం పాపిరెడ్డి పాత్రలో నరేష్ అగస్త్య నటన ఆకర్షిస్తుంది. మిగతా నటుల్ని డామినేట్ చేయకుండా, వాళ్ళకూ నటించే అవకాశమిస్తూ పాత్ర పోషణ చేశాడు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా రోమాన్స్ కోసం వున్నట్టు గాకుండా ఆమెకో కథకి పనికొచ్చే పాత్ర వుంది. ఈ పాత్రని అర్ధం జేసుకుని బాగా నటించింది. బ్రహ్మానందం, యోగిబాబులు కనిపించేది కొద్ది సేపే అయినా బాగా ఎంటర్ టైన్ చేశారు. మిగిలిన కామెడీ పాత్రల్లో జీవన్, కసిరెడ్డి, వంశీధర్ గౌడ్ లు ఓకే అనిపించారు.
సాంకేతికాల సంగతి?
కృష్ణ సౌరభ్ సంగీతంలో పాటలు, బిజిఎం చెప్పుకోదగ్గవిగా లేకున్నా సినిమా స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే ఓకే. అర్జున్ రాజా కెమెరా వర్క్ ఫర్వాలేదు గానీ సినిమా నిడివి అనవసరంగా ఎక్కువుంది. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ నిడివి తగ్గించి వుండాల్సింది.
ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ కథతో వున్న బలహీనతని కామెడీతో పూడ్చేందుకు చేసిన ప్రయత్నం 50 శాతం మాత్రమే సఫలమైంది. ఇది పెద్ద కథ కాదు, కథని పాయింటుని దృష్టిలో పెట్టుకుని తగ్గించి, సూటిగా నడిపి వుంటే వేగం పెరిగేది. అలాగే హీరో లక్ష్యం ముందే చెప్పేసి వుంటే కథనం అర్ధమయ్యేది. దర్శకుడు ఈ రెండు లోపాల్ని సవరించుకుని వుంటే ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ మరింత ఎంటర్ టైన్ చేసే అవకాశముండేది.
రేటింగ్ : 2. 25 / 5

