Modi Vaccines : మోడీ వ్యాక్సిన్లు.. జగనన్న కాలనీలు.. మరి, ప్రజలో.!

Modi Vaccines : రాష్ట్రానికైనా, దేశానికైనా ఆదాయాన్నిచ్చేదెవరు.? ఇంకెవరు ప్రజలే. మరి, రాజకీయ నాయకులు ఏం చేస్తారు.? అధికారంలో వున్నోళ్ళు చేయాల్సిందేంటి.? ఇంకేం చేస్తారు, ప్రజలు కట్టే పన్నుల్ని సద్వినియోగం చేస్తారు. కొత్త పన్నులు వేస్తారు. అంటే, జనాన్ని బాదేసే పని, అధికారంలో వున్నోళ్ళు చేస్తారన్నమాట. ఇది నిష్టుర సత్యం. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం.

మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తెరపైకొచ్చిన సంక్షేమ పథకాలకి ఆయన సొంత పేరు పెట్టుకోవడం.. లేదా ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర్లు పెట్టుకోవడమేంటి.? గతంలో చంద్రబాబు ఎందుకు ఎన్టీయార్ పేరు అలాగే తన పేరు పెట్టుకున్నట్టు.?

ఇప్పుడీ అంశం ఇంకోసారి చర్చనీయాంశమయ్యిందెందుకంటే, ఏపీలో బీజేపీ ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభ సాక్షిగా, బీజేపీ నేతలు, ‘మోడీ వ్యాక్సిన్లు..’ అన్నారు. అంతేనా, ‘జగనన్న కాలనీలు కావవి, మోడీ కాలనీలు..’ అంటూ ఏపీలోని సంక్షేమ పథకాలపై సెటైర్లు వేశారు.

అవి మోడీ వ్యాక్సిన్లు కావు. ఎందుకంటే, ఆ వ్యాక్సిన్ల కోసం కేంద్రం వెచ్చించింది ప్రజాధనం. ఇక్కడ, రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన జగనన్న కాలనీలు కూడా.. జగన్‌కి చెందిన కాలనీలు కావు.. ప్రజలకు చెందినవి. తప్పు అన్ని చోట్లా జరుగుతోంది. పెద్ద తప్పు, చిన్న తప్పు.. అంతే తేడా.

అసలు, సంక్షేమ పథకాలకి నాయకుల పేర్లు ఎందుకు పెట్టాలి.? ఎందుకంటే, వాటి పేరుతో రాజకీయంగా పబ్లిసిటీ స్టంట్లు చేయొచ్చు కాబట్టి. మళ్ళీ ఆ పబ్లిసిటీ స్టంట్ల కోసం ఖర్చు చేయాల్సింది కూడా ప్రజా ధనమే. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల మీద ప్రధాని మోడీ ఫొటో వున్నప్పుడు, సంక్షేమ పథకాల మీద వైఎస్ జగన్ ఫొటో వుంటే తప్పేంటి.? నిజానికి, రెండూ తప్పే.. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?