ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు: అప్పుడలా.. ఇప్పుడిలా.!

మంచు విష్ణు గెలిచాడు.. హ్యాపీగా వున్నాడు. ప్రకాష్ రాజ్ ఓడాడు.. అయినా, అతనికి సానుభూతి లభిస్తోంది మంచు విష్ణు నుంచి. ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థుల తరహాలో పోటీ పడ్డారు. ప్రకాష్ రాజ్‌ని దెబ్బకొట్టేందుకు మంచు విష్ణు, ‘మా’ ఎన్నికల ముందు వాడని ట్రంప్ కార్డు లేదు. అందులో కులం, మతం, ప్రాంతం.. ఇలా అన్నీ వున్నాయ్.

కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. ‘మనమంతా కుటుంబం.. మీ అనుభవం నాక్కావాలి..’ అంటూ ప్రకాష్ రాజ్ అంకుల్ మీద సరికొత్త ప్రేమ వర్షం కురిపించేస్తున్నాడు మంచు విష్ణు. ‘మా’ అధ్యక్షుడి హోదాలో మంచు విష్ణు అందర్నీ కలుపుకుపోవడం మంచిదే. కానీ, దేశద్రోహి.. అన్నట్టుగా ప్రకాష్ రాజ్ మీద ఆరోపణలు చేసి, ఆయన సీనియారిటీ తనకు ఉపయోగపడుతుందని చెప్పడమేంటి.?

ఇక్కడ మెగా క్యాంప్ తెలుసుకోవాల్సిన నీతి ఒకటి వుంది. ఎవరినీ గుడ్డిగా సపోర్ట్ చేయకూడదు. సరే, సీన్‌లో తెరవెనుకాల చిరంజీవి పనిచేశారా.? లేదా.? అన్నది వేరే చర్చ. సీన్‌లో నేరుగా కనిపించిన నాగబాబుకి ఇది సరిగ్గా అర్థం కావాలి. ప్రకాష్ రాజ్, రేపో మాపో మంచు విష్ణుతో కలిసిపోవచ్చు. మంచు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైపోవచ్చు. అతనికి పెద్దగా నష్టం వుండదు.

మెగా కాంపౌండ్ చాలా నష్టపోయింది.. పరువు ప్రతిష్టల సమస్యగా ‘మా’ ఎన్నికలు మెగా కాంపౌండ్ చుట్టూ ఓ బలవంతపు ప్రచారాన్ని రుద్దబడింది. అలా జరిగిన నష్టం నుంచి మెగా కాంపౌండ్ కోలుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాకపోవచ్చు.

ప్రకాష్ రాజ్ – పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ విభేదాలున్నాయి. అయినా, అతన్ని మెగా కాంపౌండ్ సమర్థించింది. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. దురదృష్టమేంటంటే, ఈ వ్యవహారంతో మంచు కుటుంబంతో సినీ రాజకీయ వైరం మెగా కుటుంబానికి పెరిగింది. కాదు కాదు, యావత్ సినీ పరిశ్రమలోనే మెగా కుటుంబానికి ఇదొక నెగెటివ్ వైబ్ అయిపోయింది.

దీన్నుంచి మెగా కాంపౌండ్ ఎలా కోలుకుంటుందోగానీ.. డ్యామేజీ కంట్రోల్ కోసం చిరంజీవి అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.. పెట్టేయాలి, తప్పదు మరి.