Manchu Mohan Babu : అత్యంత హేయంగా, జుగుప్సాకరంగా మంచు మోహన్‌బాబు సహా ఆయన కుటుంబ సభ్యులపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోంది. యూ ట్యూబ్ వీడియోలు, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్స్ కామెంట్స్, పోస్టింగ్స్ కారణంగా మంచు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.
ఈ నేపథ్యంలో జుగుప్సాకరమైన రీతిలో, అభ్యంతకరమైన విధానంలో తమపై ద్వేషాన్ని ప్రదర్శిస్తోన్నవారిపై చట్టపరమైన చర్యలకు వెనుకాడేది లేదంటూ మంచు కుటుంబం ఓ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది. తక్షణం, అభ్యంతకర కంటెంట్ తొలగించాల్సిందిగా ఈ హెచ్చరికల్లో పేర్కొన్నారు.
మోహన్‌బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా వ్యవహారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల వ్యవహారం.. ఇలా ఈ రెండు ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి మోహన్‌బాబు మీద ట్రోలింగ్ జరుగుతోంది. మంచు విష్ణుపైనా ట్రోలింగ్ జరుగుతోంది.
నిజానికి, సెలబ్రిటీలపై ట్రోలింగ్ జరగడం ఇదే కొత్త కాదు. ఈ ట్రోలింగ్ విషయంలో మెగా కుటుంబం కూడా బాధితులుగానే వున్నారు. ఆ మాటకొస్తే, ట్రోలింగ్ సెలబ్రిటీలందరిమీదా జరుగుతోంది. అభిమానుల ముసుగులో కొందరు దురభిమానులు చేసే పైశాచికత్వమిది. ఆయా సందర్భాల్లో ఆయా ప్రముఖులే కొందర్ని ఎంగేజ్ చేసుకుని ఇలాంటి వైపరీత్యాలకు పాల్పడుతుంటారనే వాదనా లేకపోలేదు.
అయితే, సోషల్ మీడియా వేదికగా మీమ్స్ కావొచ్చు, కామెంట్లు, వీడియోలు కావొచ్చు.. వీటిని నిరోధించడం అంత తేలికైన వ్యవహారం కాదు. మరి, మంచు కుటుంబం ఈ విషయంలో ఎలా ముందడుగు వేస్తుందో వేచి చూడాల్సిందే.