మంచు మనోజ్ దాదాపు ఏడేళ్ల తర్వాత సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘భైరవం’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మనోజ్.. తాజాగా విడుదలైన ‘మిరాయ్’ చిత్రంతో భారీ విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్‌లో మనోజ్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తన ఫోన్ మోగుతూనే ఉందని తెలిపారు. మిరాయ్ సినిమా బ్లాక్‌బాస్టర్ కావడం ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. మూవీలో తన నటనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయని.. ఇదంతా చూస్తుంటే ఓ కలలా అనిపిస్తుందన్నారు.
ఎక్కడికి వెళ్లినా కమ్ బ్యాక్ ఎప్పుడు ఇస్తావ్ చాలా మంది అడిగేవారని.. త్వరలోనే ఇస్తానని చెప్పేవాడినన్నారు. కానీ లోపల మాత్రం భయపడుతూ ఉండేవాడనని పేర్కొన్నారు. ఎందుకంటే చాలా సినిమాలు చివరి క్షణంలో రద్దయ్యాయని తెలిపారు. కానీ తనను నమ్మిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, నిర్మాత విశ్వప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ అవకాశం ద్వారా తననే కాకుండా తన కుటుంబాన్ని కూడా నిలబెట్టారని ఎమోషనల్ అయ్యారు. తనతో సినిమాలు చేయొద్దని ఎంతో మంది చెప్పి ఉంటారని.. అయితే విశ్వప్రసాద్ తనను నమ్మి ఈ అవకాశం ఇచ్చారన్నారు. ఇటీవల తనతో సినిమాలు చేయొద్దని చెబుతున్నారని.. అలా చాలా సినిమాలు మిస్ అయ్యాయని భావోద్వేగానికి గురయ్యారు. అయినా కానీ ఎప్పుడూ నిరాశపడలేదని.. ఎంతమంది తనను వ్యతిరేకించినా తాను పట్టించుకోనని చెప్పుకొచ్చారు. తన సినిమా హిట్ అవ్వాలని కోరుకున్న అందరికీ పేరుపేరునా పాదభివందనం అని మనోజ్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే మిరాయ్ సినిమా విజయం సాధించడంపై మంచు విష్ణు మూవీ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. విష్ణు ట్వీట్‌కు మనోజ్ థ్యాంక్యూ అన్న రిప్లై ఇవ్వడం వైరల్‌గా మారింది. కొంతకాలంగా మంచు బ్రదర్స్ మధ్య ఆస్తి వివాదాలు జరుగుతున్న విషయం విధితమే. ఒకరిపై ఒకరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు ట్వీట్స్ చేసుకోవడం చూస్తుంటే వివాదాలను ఫుల్ స్టాప్ పడినట్లేనని అభిమానులు చర్చించుకుంటున్నారు.
కాగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్ ‘మిరాయ్’ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా, మనోజ్ విలన్ పాత్రలో నటించారు. టీజర్, ట్రైలర్‌తో మంచి అంచనాలు అందుకున్న సినిమా సెప్టెంబర్ 12న విడుదలై బ్లాక్‌బాస్టర్ విజయం అందుకుంది. మూవీలో విజువల్స్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయని, తేజ, మనోజ్ నటన అదిరిపోయిందని ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు అదిరిపోతున్నాయి.
