విశాఖలో టీడీపీ బలం చాలా ఎక్కువ. ఉత్తరాంధ్ర సహా మూడు జిల్లాలూ టీడీపీకి కంచు కోటలు. అటువంటి చోట 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగింది. కేవలం ఆరంటే ఆరు అసెంబ్లీ సీట్లు తప్ప టోటల్ గా టీడీపీ కోల్పోయింది. ఇక విశాఖ సిటీలో మాత్రం నాలుగు సీట్లను గెలుచుకుని సత్తా చాటింది. గత ఏడాది మునిసిపల్ ఎన్నికల ప్రకటన నాటికి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే ఇపుడు జరుగుతున్న జీవీఎంసీ ఎన్నికల వేళకు అవి కాస్తా దిగజారి రెండుగా అయిపోయాయి. దాంతో టీడీపీకి విశాఖ గట్టిగానే షాక్ ఇస్తుందా అన్న చర్చ మొదలైంది. విశాఖ మేయర్ సీటుని మూడున్నర దశాబ్దాల క్రితం పట్టిన టీడీపీకి నాటి నుంచి మరో మూడు ఎన్నికలు జరిగితే ఎక్కడా కుర్చీ దొరకలేదు.
వరుసగా కాంగ్రెస్ జెండా ఎగరేసి జీవీఎంసీ పీఠం తన్నుకుపోయింది. ఇపుడు కూడా ఆశలు నెరవేరేలా లేవు అంటున్నారు. విశాఖ మేయర్ సీటు దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 57 సీట్లు రావాలి. కానీ టీడీపీకి ఇపుడున్న సీన్ చూస్తూంటే గత ఎన్నికల్లో వచ్చిన ముప్పయి సీట్లు అయినా వస్తాయా అన్న డౌట్ కనిపిస్తోంది. విశాఖ సౌత్ లో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి దూకేశారు. దాంతో అక్కడ టీడీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక మరో వైపు చూసుకుంటే విశాఖ ఉత్తరం నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సరైన సమయంలో కాడె వదిలేశారు. ఆయన ఉక్కు పోరాటం పేరు మీద తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ విధంగా సిటీలో వైసీపీకి గట్టి పట్టు దొరికేసింది. ఇక విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ బాబుని గట్టిగానే వైసీపీ ఢీ కొడుతోంది. అక్కడ నుంచే వైసీపీ మేయర్ అభ్యర్ధి పోటీలో ఉన్నారు.
ఆ ప్రభావం అక్కడ కచ్చితంగా ఉంటుంది. అలాగే విశాఖ పశ్చిమాన వైసీపీ పూర్తిగా అష్ట దిగ్బంధనం చేసి మరీ సైకిల్ కి బ్రేకులు వేస్తోంది. మిగిలిన చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ దర్జా ఎటూ ఉంది. పార్టీ పెట్టి నాలుగు దశాబ్దాలు అవుతోంది. టీడీపీకి ఎన్నో విజయాలు దక్కినా కూడా విశాఖ వంటి మెగా సిటీలో మేయర్ సీటు మాత్రం ఊరించి ఉసూరుమనిపిస్తోంది. ఈసారి కాకపోతే మరెప్పుడూ ఇక్కడ టీడీపీ పాగా వేయలేదు అని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఎందుచేతనంటే వైసీపీ కనుక ఒక్కసారి మేయర్ పీఠమెక్కితే సిటీలో క్షేత్ర స్థాయిలో కచ్చితంగా పాతుకుపోతుంది. ఆ స్థాన బలం ముందు టీడీపీ నిలబడే చాన్స్ అసలు లేదు. పైగా ఇప్పటికి అనేక ఎన్నికల్లో ఓడిన తరువాత ఈసారి కూడా ధికారం రాకపోతే సిటీలో టీడీపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.