‘అందరి బంధు’వయా: కేసీయార్.. మాస్టర్ ప్లాన్.!

దళిత బంధు మాత్రమే ఎందుకు.? బీసీ బంధు ఎందుకు కాకూడదు.? మైనార్టీ బంధు ఎందుకు కాకూడదు.? ఈ ప్రశ్న ‘దళిత బంధు’ పథకం తర్వాత జనంలోంచి వినిపించింది. ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయాలి. ఈ క్రమంలో ప్రజల్ని మతాల వారీగా, కులాల వారీగా విడగొట్టి.. విడివిడిగా సంక్షేమ పథకాలు ప్రకటించడమేంటి.? పేదోడికి ప్రభుత్వం నుంచి సాయం అందాలి. ఇక్కడ కులాల, మతాల ప్రస్తావన రానే రాకూడదు. కానీ, మన రాజకీయ పునాదులే కులం, మతం, ప్రాంతం మీద ఆధారపడి వున్నాయన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఎలాగైతేనేం, కేసీయార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేలా వుంది. ‘అందరి బంధు’వు అన్నట్లుగా కేసీయార్ గుర్తింపు పొందాలనుకుంటున్నారు. త్వరలోనే బీసీ బంధు పథకానికి రూపకల్పన చేసే దిశగా అడుగులేస్తున్నారు.

నిజానికి, దేశవ్యాప్తంగా జరగాల్సిన చర్చ ఇది. పేదలకు కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా.. అందరికీ సాయం అందాలి. దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థతులకీ స్పష్టమైన తేడాలున్నాయి. వాటిని అర్థం చేసుకోవడంలో రాజకీయ వ్యవస్థ విఫలమవుతోంది. అదే సమయంలో కులాలు, వర్గాలు, ప్రాంతాలు, మతాల వారీగా ప్రజల్ని విడగొట్టి రాజకీయ లబ్ది పొందుతున్నాయి రాజకీయ పార్టీలు. అన్నట్టు, సంక్షేమ పథకాల విషయంలో ఇంకో ఆరోపణ కూడా వుంది. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు అప్పలు చేస్తూ, అభివృద్ధిని విస్మరిస్తుండడంతో.. ఆ అప్పుల భారం.. సంక్షేమ పథకాలు పొందనివారిపై చాలా ఎక్కువగా పడుతోంది. పన్నుల మోత మోగిపోతుండడం పన్ను చెల్లింపు దారులకు నరకయాతనగా మారిపోతుందన్న వాదన వుంది. మొత్తంగా చూస్తే, ఈ రాజకీయ సంక్షేమం.. అన్ని వ్యవస్థల్నీ కుప్పకూల్చేలా తయారైందన్నది ఆర్థిక రంగ నిపుణుల వాదన.