Kamal Haasan Shock: హిందీలో.. తర్వాత దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్లాక్ బస్టర్ షో బిగ్‌బాస్.. ఈ షో తమిళ్ వెర్షన్‌కి ప్రముఖ హీరో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం అందరినీ షాకింగ్‌కి గురిచేసింది. తమిళ బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. తన తదుపరి చిత్రం షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.
కరోనా లాక్‌డౌన్ కారణంగా “విక్రమ్” సినిమా కోసం నిర్మాణ కార్యకలాపాలను రీషెడ్యూల్ చేయవలసి వచ్చింది. అనివార్య పరిస్థితుల్లో బిగ్ బాస్ కోసం కేటాయించాల్సిన డేట్స్ విక్రమ్ సినిమా కోసం కేటాయించాల్సి వస్తోంది. కొంతమంది స్టార్స్, టెక్నికల్ పర్సన్స్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలను పూర్తి చేయడానికి మరికొన్ని రోజులు విక్రమ్ షూటింగ్ కోసం కేటాయించాల్సి వస్తుంది అంటూ కమల్ హాసన్ ఓ లేఖలో పేర్కొన్నారు.
విక్రమ్ సినిమా షూటింగ్ వల్ల బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నానని, సినిమా డేట్లు, బిగ్ బాస్ అల్టిమేట్ డేట్లు క్లాష్ అవ్వవని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్, విజయ్ టీవీ, బిగ్ బాస్ బృందంతో చర్చించానని.. వారు దీనికి అంగీకరించారని ఆయన చెప్పారు. వారు కూడా తనను బాగా అర్థ చేసుకున్నారని, వారి అనుమతి తీసుకున్నాకే తన నిర్ణయం ప్రకటిస్తున్నానని ఆయన చెప్పారు. అంతే కాకుండా ఆరో సీజన్‌తో మీ ముందుకు వస్తానంటూ కమల్ హాసన్ తెలిపారు.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకోంటుంది. అయితే ఎప్పుడో ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది. కాగా ఈ మూవీలో కమల్ హాసన్‌తో పాటు నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, ఈ సినిమా విడుదల కూడా ఈ ఏడాదిలోనే విడుదలవుతుందని సమాచారం.