కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోవడంలో జగన్ సర్కార్ తొలి నుంచి పటిష్టంగానే వ్యవరిస్తోంది. ఎక్కడిక్కడ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయడం, కరోనా పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ అని తేలితే హుటాహుటిన ఐసోలేట్ చేసి చికిత్స కు తరలించడం జరుగుతోంది. క్వారంటైన్, ఐసోలేషన్ లో ఉన్న వారు త్వరగా కోలుకునేలా పౌష్టికాహరం అందించడం జరుగుతోంది. గత మూడున్నర నెలలుగా జగన్ సర్కార్ ఇదే పనిలో ఉంది. ఆరంభంలో కాస్త తడబాటుకు గురైనా ఇప్పుడు కరోనాని ఎదుర్కోవడంలో సక్సెస్ దిశగానే అడుగులు పడుతున్నాయి. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా! జగన్ సర్కార్ అంతే వేగంగా చర్యలు తీసుకుంటోంది.
ఇక వర్షాకాలం కూడా మొదలవుతోన్న నేపథ్యంలో సీజనల్ జ్వరాలు కూడా ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో మందొస్తుగా వాటికి సంబంధించిన పరీక్షలకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. మలేరియా, టైపాయిడ్, డెంగ్యూ లాంటి జ్వరాలు అధికంగా ఉన్నప్రాంతాల్ని ముందుగానే గుర్తించి పరీక్షలు నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఓ యాక్షన్ ప్లాన్ ని కూడా ప్రభుత్వం సిద్దం చేసి పెట్టుకుంది. తాజాగా కోవిడ్-19 నివారణ తదుపరి చర్యల్లో భాగంగా 90 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రభుత్వం సిద్దం చేసుకుంది. రాష్ర్టంలో ప్రతి కుటుంబానికి పూర్తి స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించి స్ర్కీనింగ్ చేయాలని సీఎం అధికారులని ఆదేశించారు.
పరీక్షల కోసం 104 వాహనాలను వినియోగించుకోనున్నారు. మధుమేహం, బీపీలాంటి దీర్ఘ కాలిక వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించి వారికి అక్కడే మందులు కూడా ఇవ్వనున్నారు. నెలకొకసారి 104 ద్వారా వైద్య సేవలు, స్ర్కీనింగ్ జరిగేలా ఆదేశించారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కార్మికులను గుర్తించి…వాళ్లకి ఇళ్లలోనే మరోసారి అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మహమ్మారి పూర్తిగా తొలగిపోయే వరకూ సర్కార్ ఈ రకంగా ముందుకు వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందొస్తు చర్యలుగానే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ నిర్ణయంతో ప్రజల్లో టెన్షన్ కూడా మొదలైంది. కరోనా మూడవ స్టేజ్ అయిన సమూహ వ్యాప్తి ఏపీలో మొదలైందా? అందుకే జగన్ 90 రోజుల యాక్షన్ ప్లాన్ తో ముందుకొస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే భారత్ ఇంకా మడవ దశకు చేరుకోలేదని అధికారులు, డబ్ల్యూ హెచ్ ఓ ఎక్కడా చెప్పలేదు. కాబట్టి టెన్షన్ పడాల్సిన పనిలేదు. అవన్నీ కేవలం ప్రజల్లో ఉన్న అపోహలు మాత్రమే. ఏదేమైనా జగన్ సర్కార్ మాత్రం వైరస్ వ్యాప్తి చెందకుండా..వైరస్ వ్యాప్తి కన్నా వేగంగా చర్యలు తీసుకుంటోంది.