ఇది అక్షరాలా ప్రభుత్వంపై యుద్ధమే

ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై ఒక రాజ్యాంగవ్యవస్థ సాగిస్తున్న ప్రత్యక్ష సమరం!
అత్యున్నత న్యాయవ్యవస్థ ఆదేశాలను సైతం ధిక్కరించడమే!!
కోట్లాది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటమే!!!
 
చంద్రబాబు పాలనలో జరపాల్సిన ఎన్నికలను తెలుగుదేశం పార్టీ పట్ల నిశ్శబ్దంగా వెల్లువెత్తిన ప్రజావ్యతిరేకత నుంచి చంద్రబాబుకు భంగపాటు కలగకుండా ఆయన  అంతరంగం మేరకు వాయిదా వేసి,  ఎన్నికలు జరపడం రాజ్యాంగ విధి అంటూ సుద్దులు పలుకుతూ కేవలం తన పంతాన్ని చెల్లించుకోవడం కోసం,   చంద్రబాబు అభిమతాన్ని నెరవేర్చడం కోసం ఎన్నికల కమీషన్ హడావిడిగా తీసుకున్న నిర్ణయం ఫలితమే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్! 
 
వాస్తవానికి ఎన్నికల కమీషన్, ప్రభుత్వం కలిసి కూర్చుని చర్చించుకుని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోమని హైకోర్టు హితవు పలికింది.  అందుకు గడువు కూడా విధించింది.  ఆమేరకు అత్యున్నత స్థాయి అధికారులు ఎన్నికల కమీషన్ ను కలిసి తమ అభ్యంతరాలను, అశక్తతను వెలిబుచ్చుతూ లిఖితపూర్వకంగా తెలియజేసింది.  అయినప్పటికీ ప్రభుత్వ ప్రతినిధులు వెళ్లిన గంటల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందంటే అప్పటికే వారు ఒక నిశ్చయానికి వచ్చి షెడ్యూల్ అంతా సిద్ధం చేసుకున్నారని భావించాలి.  
 
గత ఏడాది ఎన్నికల కమీషన్ మొదలైన ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసినపుడు ఐదో ఆరో కరోనా కేసులు ఉన్నాయి.  దేశంలో ఎక్కడా లాక్ డౌన్ లేదు.  కోవిద్ నిబంధనలు లేవు.  మరి ఎన్నికల కమీషనర్ చెప్పినట్లే రోజుకు మూడు వందల కేసులు ఉంటే ఎన్నికలు ఎలా నిర్వహించాలనుకుంటున్నారో వారికే తెలియాలి.  ప్రభుత్వ విజ్ఞప్తికి మన్నన ఇవ్వకుండా ఏకపక్షంగా ఎన్నికల కమీషన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ అపచారమే కాదు, ప్రభుత్వ అధికారాన్ని కూడా తృణీకరించడమే. 
 
దేశవ్యాప్తంగా టీకా వేసే ప్రక్రియ మొదలవుతుంది.  లక్షలాది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.  ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ కష్టం అని ప్రభుత్వం చెబుతున్న కారణాలు సమంజసం.  మరో రెండు నెలల్లో పదవీవిరమణ చేసే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రజారోగ్యం పట్ల ఏమి ఆసక్తి ఉంటుంది?  ఆయనేమీ ప్రజలకు బాధ్యుడు కాదు.  కానీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.  
 
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎన్నికల గూర్చి చేసిన ప్రకటనను సాకుగా చూపిస్తూ “ప్రభుత్వంలో కీలక వ్యక్తులు జూన్, జులై నెలలో జరుగుతాయని ప్రకటిస్తున్నారు”  అంటూ ప్రభుత్వ ప్రతినిధులకు వీడియోలు చూపించడం చూస్తుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉన్న పాలనాపరిజ్ఞానం మీద సందేహం కలుగుతోంది.   ప్రభుత్వంలో ఒక ఎంపీ సాంకేతికంగా కీలకమైన వ్యక్తి ఎలా అవుతారో ఆయనే చెప్పాలి.  బాధ్యత కలిగిన మంత్రులు, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు కీలక వ్యక్తులు అవుతారు తప్ప ఒక ఎంపీ చేసిన ప్రకటనను  ఎన్నికల కమీషన్ ఎలా పరిగణనలోకి అధికారికంగా తీసుకుంటుంది?  రేపు మరొకరు అసలు ఎన్నికలు జరగవు అని ప్రకటిస్తారు.  అది కీలక వ్యక్తి ప్రకటన అవుతుందా?  వైసిపిలో విజయసాయి రెడ్డి అగ్రనేత.  ఆయన పార్టీ నాయకుడుగా తన అభిప్రాయం వ్యక్తపరిచారు.   అది అధికారిక డాక్యుమెంట్  ఎలా అవుతుంది?   ఆయనేమైనా ఎంపీ హోదాలో ప్రభుత్వం తరపున రాతపూర్వకంగా ప్రకటించారా?    ఎన్నికలు డిసెంబర్ లో జరుగుతాయి అని నేను రాస్తాను.  అంతమాత్రాన నా రాతలను ఎన్నికల కమీషన్ లెక్కలోకి తీసుకుంటుందా?     ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటారు కాబట్టి పరిస్థితులను అంచనా వేస్తూ విజయసాయిరెడ్డి గారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  అందులో తప్పేముంది?  
 
ఎన్నికల కమీషన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం మీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నది.  నెలరోజుల ముందే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందంటూ ఎన్నికల కమీషన్ చేసిన ప్రకటన కేవలం దురహంకారపూరితం, జగన్ చేపడుతున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునే కుతంత్రమే.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ దుందుడుకు చర్య వెనుక చంద్రబాబు ఉన్నారనేది సందేహాతీతం.  వీరి ఆగడాలను సహించరాదు.   2018 లో జరగాల్సిన ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు జరపలేదో ముందు కోర్టుకు, ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి.
 
   
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వానిదే పైచేయిగా ఉండాలి.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే శిలాశాసనం కావాలి.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు