Modi : ఔనా, నరేంద్ర మోడీ అలా ఆలోచిస్తున్నారా.?

Modi : రెండేళ్ళలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. అంతకన్నా ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారా.? అంటే, ఔననే చర్చ సర్వత్రా జరుగుతోంది. పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉమ్మడి తెలుగు రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావించడం వెనుక పెద్ద వ్యూహమే వుందట. ఆ వ్యూహం, తెలుగు రాష్ట్రాలపై బీజేపీ పట్టు సాధించడం కోసమేనని అంటున్నారు.

2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కేంద్రం ప్రకటించే అవకాశం వుందన్నది ప్రస్తుతం హాటు హాటుగా సంచరిస్తోన్న ఊహాగానాల సారాంశం. ప్రత్యేక హోదాని ఇవ్వడంతోపాటు, పవన్ కళ్యాణ్‌ని బీజేపీ – జనసేన కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతున్నారట.

నిజానికి, ఈ గాసిప్ కొత్తదేమీ కాదు. గతంలోనే వినిపించింది. ఆ హామీతోనే పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చాన్నాళ్ళ క్రితం గాసిప్స్ వచ్చాయి. వాటిపై అప్పట్లో వైసీపీ, టీడీపీ చేసిన విమర్శలూ చాలామందికి గుర్తుండే వుంటాయి.

మరి, తెలంగాణ అంశాన్ని ప్రధాని మోడీ ఎలా డీల్ చేయబోతున్నారు.? అంటే, విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాల్ని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రస్తావించి, వాటికి మోక్షం కల్పించబోతున్నారట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందే జరుగుతాయనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయనీ బీజేపీ అంచనా వేస్తోంది.

బీజేపీ అంచనాలు నిజమైతే, తెలంగాణతోనూ, ఆంధ్రప్రదేశ్‌తోనూ ఆ పార్టీకి రాజకీయంగా పెద్దగా ఇబ్బంది వుండదు.. పైగా, కాస్తో కూస్తో ఆ రెండు రాష్ట్రాల్లో అడ్వాంటేజ్ అవుతుందన్నది బీజేపీ అధిష్టానం యోచన. ఆ ప్లాన్ ప్రకారమే ప్రధాని మోడీ, విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారంటున్నారు. నిజమేనా.? నమ్మొచ్చా.? అక్కడున్నది నరేంద్ర మోడీ గనుక.. నమ్మడానికి వీల్లేదేమో.!