ఇటీవల విశాఖలో చోటు చేసుకున్న గ్యాస్ దుర్ఘటన తో దేశం ఉలిక్కి పడింది. ఇలాంటి కంపెనీల మధ్య..ప్రాణాంతక విష వాయువులు, రసాయనాల మధ్య నిద్రిస్తున్నామా? అని ఒక్కసారిగా సామాన్యుడు సైతం ఆలోచనలో పడ్డాడు. ప్రమాదకర వాయువులు బయటకు లీకైతే ఎంత ఉప్పెనకు దారి తీస్తుందో 33 ఏళ్ల భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత స్టైరీన్ గ్యాస్ ఘటనతో మరోసారి రుజువైంది. జనావాసాలకు దూరంగా ఉండాల్సిన కంపెనీలు జనాల మధ్య ఏర్పాటు చేసి అమాయక ప్రజల ప్రాణాలకు కారణమవుతున్నాయి కార్పోరేట్ కంపెనీలు. విశాఖ- కాకినాడ-చెన్నై మధ్య పెట్రోకెమికల్ కారిడార్ ప్రకటించడంతో విశాఖ-కాకినడ మధ్య మరిన్ని రసాయన పరిశ్రమల ఏర్పాటు జోరుగా సాగుతోంది.
ఇప్పటికే నక్కపల్లిలో వందల ఎకరాల్లో హెటిరో డ్రగ్స్ ఫార్మా కంపెనీ ఏర్పాటైంది. తుని-పాయకరావు పేట మధ్య ప్రమాదరకరమైన పురుగుల మందు ఫ్యాక్టరీ డెక్కన్ కెమికల్స్ నిర్వహణలో ఉంది. అయితే వైజాగ్ ఘటనతో డెక్కన్ కెమికల్స్ నుంచి ప్రమాదకరమైన విషవాయువులు వెలువడుతున్నాయని ఆ కారణంగా వాసన భరించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తమలపాకు తోటలు, కొబ్బరి తోటలు సహా గాలిలో కలిసి వస్తోన్న వాయువులు కారణంగా తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు వాపోయారు. డెక్కన్ కెమికల్ కంపెనీ ఏర్పాటైన దగ్గర నుంచి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.
పాయకరావు పేట మండలం సత్యవరం వైకాపా నాయకులు దీనిపై కనీస శ్రద్ధతో సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డెక్కన్ కెమికల్స్ కంపెనీ ఇంకా విస్తరణకు సిద్దమవుతోంది. అదే జరిగితే ఆ చుట్టు ప్రక్కల గ్రామాలు ప్రమాదంలో ఈదాల్సిందే. అయితే విశాఖ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రసాయన పరిశ్రమలపై ఉక్కు పాదం దిశగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. జనావాసాలకు దూరంగా కంపెనీలు ఉండాలని, వాటిపై నిరంతర పర్య వేక్షణ ఉండాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూమెంట్ యాక్ట్ కు రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు.
కాలుష్యం, ప్రమాదకర పదార్ధాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. రియల్ టైమ్ లో డేటా స్వీకరణతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఫైన్ కడితే సరిపోద్దాని కంపెనీలు అనుకోవద్దు. ఆఛాన్స్ ఒక్కసారే ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ ఉంచాలా? మూసేయాలా? అన్నది ప్రభుత్వం డిసైడ్ చేస్తుందని హెచ్చరించారు. ప్రజల క్షేమం కన్నా ఏదీ ముఖ్యం కాదని సీఎం ఉద్ఘాటించారు. ప్రతీ కంపెనీ స్వయంగా పీసీబీ సూచనలు రిపోర్ట్ ఇచ్చే విధంగా చట్టంలో ప్రతిపాదనలు తీసుకురావాలన్నారు. ప్రతీ నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలన్నారు. రెండ్, ఆరెంజ్ జోన్ లో ఉన్న కంపెనీలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. కంపెనీలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కంపెనీలో లోపాలు..లొసుగులు ఏమైనా ఉంటే తక్షణం వాటిని పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి బ్యాన్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.