విశాఖలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ప్రధాని మోడీ ప్రసంగం..!

విశాఖపట్నం సముద్రతీరాన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ రోజు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. స్వేచ్ఛా వాతావరణంలో, అరుదైన ఆనందానుభూతితో లక్షలాది మంది ప్రజలు యోగాసనాలు వేశారు. విశాఖ సాగరతీరాన యోగా ఉత్సవం అద్భుత దృశ్యంగా మారింది. ఈ విశిష్ట కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, యోగాకు సరిహద్దులు లేవని.. ఇది ప్రపంచాన్ని ఏకం చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే 175 దేశాల్లో యోగా అభ్యాసం జరుగుతోందని, అంతరిక్షంలో కూడా భారతీయులు యోగా చేసిన ఘనత మనదేనని చెప్పారు. యోగా గ్లోబల్ ఉద్యమంగా మారడం భారత్‌కి గర్వకారణమని చెప్పారు.
విశాఖ వేదికగా నిర్వహించిన ‘యోగాంధ్ర’ ఈవెంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మోడీ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

వన్ ఎర్త్ – వన్ హెల్త్ అనే థీమ్‌తో ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని నిర్వహించామని, ఢిల్లీ ఎయిమ్స్ యోగా ఆధారిత చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేస్తోందని ప్రధాని వెల్లడించారు. ప్రజలలో యోగా పట్ల అవగాహన పెంచేందుకు ప్రత్యేక ఈకో సిస్టమ్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. యోగా ఒక క్రమశిక్షణ, ఒక జీవనశైలి. ఇది మానవ శరీరానికే కాదు, మనసుకు, సమాజానికి మార్గదర్శకని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ తినే ఆహారంలో 10 శాతం నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. సంతులిత జీవనశైలి అవసరమని, యోగా ద్వారా అది సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.