కరోనా పాండమిక్ అనేదొకటి వస్తుందనీ.. సినిమా థియేటర్లన్నీ మూతపడతాయనీ ఎవరన్నా కలగలన్నారా.? కరోనా పాండమిక్ ద్వారా అది సాధ్యమయ్యింది. తిరిగి సినిమా థియేటర్లు తెరచుకుంటాయో లేదో తెలియదు.. తెరచుకుంటే ప్రేక్షకులు వస్తారో రారో తెలియదు.. వెరసి సినిమా పరిశ్రమ తీవ్ర అయోమయంలో పడిపోయింది కొన్నాళ్ళ క్రితం.
ఇప్పడిప్పుడే మళ్ళీ సినీ పరిశ్రమలో కొంత ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినాగానీ, సినిమా థియేటర్ల వ్యవహారానికి సంబంధించి ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తి వుంది. అందుక్కారణం, టిక్కెట్ల ధరలే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టిక్కెట్ ధరల్ని రెగ్యులేట్ చేస్తామంటోంది. అందుకు కొంత మేర సినీ పరిశ్రమ నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది.
మరోపక్క, పవన్ కళ్యాణ్ వివాదం తర్వాత.. అసలు సినిమాల్ని ఇకపై థియేటర్లలో చూసేదే లేదంటూ పవన్ అభిమానులు తెగేసి చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రమాణాలు కూడా చేసేస్తున్నారు. కేవలం ఓటీటీల్లోనే సినిమాలు చేస్తామనీ, గతంలో సినిమాలకు ఎంతైతే వెచ్చించామో.. అదే మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా అందిస్తామనీ భీష్మ ప్రతిజ్ఞలు చేసేస్తున్నారు. ఆవేశంలో ఇలాంటి మాటల్ని సినీ అభిమానులు చెప్పడం మామూలే. పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’ థియేటర్లలోకి వస్తే, ఎగేసుకుంటూ అభిమానులు థియేటర్లకు వెళ్ళకుండా వుంటారా.? ఇతర హీరోల సినిమాలు చూడకుండా వుంటారా.? సరే, ఈ వివాదాన్ని పక్కన పెడితే.. ఓటీటీ దెబ్బకి సినిమా థియేటర్ల అలవాటు చాలావరకు పోయింది ప్రేక్షకులకి.
‘థియేటర్ అనుభూతి’ అనే మాట చెప్పుకోడానికి బాగానే వుంటుందిగానీ, పాటించడానికి ఇబ్బందికరంగా తయారైంది. కరోనా నేర్పిన పాఠమిది. సో, సినీ పరిశ్రమ తాజా పరిణామాలపై ఆచి తూచి వ్యవహరించాల్సి వుంటుంది. అంటే, రాజకీయ కోణంలో అని కాదు.. ప్రేక్షకుల కోణంలో. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడమెలా.? అన్నదానిపై ప్రభుత్వాలతో కూర్చుని సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత పరిశ్రమ పెద్దలదే. అదే సమయంలో ఓటీటీ ఒత్తిళ్ళకు నిర్మాతలు లోనుకాకుండా కూడా చూసుకోవాలి.