హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడంలేదు. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అంటే కత్తి మీద సాము లాంటిదే. మొదటి వేవ్ తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలే, రెండో వేవ్ తీవ్రతకు కారణమన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చీవాట్లు తినాల్సి వచ్చింది. దాంతో, ఈసారి జాగ్రత్తపడుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు సానుకూలంగా వున్నాయా.? లేదా.? అన్నదానిపై అభిప్రాయ సేకరణ కోసం ఈ నెలాఖరు వరకు గడువు పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. అంటే, ఈ నెలలో హుజూరాబాద్ ఉప ఎన్నికలపై ప్రకటన వచ్చే అవకాశం లేదు. అభిప్రాయాలు సేకరించాలి, వాటిని క్రోడీకరించి.. నిర్ణయం తీసుకోవాలి. దానికి కొంత సమయం పట్టే అవకాశం వుంది.
మరి, ఈలోగా హుజూరాబాద్ విషయమై రాజకీయ పార్టీలు ఏం చేయబోతున్నాయ్.? ఏం చేస్తాయి, కాస్త విశ్రాంతి తీసుకుంటాయి. కానీ, అధికార తెలంగాణ రాష్ట్ర సమితికే ఇది పెద్ద తలనొప్పి. ఎందుకంటే, దలిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌లో ప్రారంభించడంతోపాటు, దాన్ని తెలంగాణ అంతటా అమలయ్యేలా చూడాలిప్పుడు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చి, 500 కోట్ల రూపాయల విడుదలకు కేసీయార్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. 119 నియోజకవర్గాలకు 500 కోట్ల చెప్పున ఇచ్చుకుంటూ పోతే, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమవుతుందట.? ఎలా.? ఇప్పడీ గండం నుంచి గట్టెక్కేదెలా.? మరోపక్క, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా తన పాదయాత్రని ప్రస్తుతానికి కొంతకాలం పాటు అర్థాంతరంగా వాయిదా వేసుకోవాల్సిందే. అనారోగ్యంతో ఇప్పటికే బ్రేక్ ఇచ్చిన ఈటెల, ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడానికి మార్గం సుగమం అయ్యిందన్నమాట. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థినే ఖరారు చేయలేదు. సో, ఆ పార్టీకి కూడా తగినంత సమయం వుంది. ఈ గ్యాప్.. ఎన్ని రాజకీయ ట్విస్టులకు కారణమవుతుందో వేచి చూడాలి.